Idream media
Idream media
మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందనే వాదన కంటే విడ్డూరం మరొకటి ఉండదు. అఖిలప్రియ కుటుంబంపై ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందంటూ టీడీపీ బృందం మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేసింది. గత కొంత కాలంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పదేపదే వైసీపీ ప్రభుత్వం జేసీ కుటుంబంతో పాటు అఖిలప్రియ కుటుంబాలను ప్రభుత్వం వేధిస్తోందని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది.
కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయనే సామెత చందాన రాష్ర్టంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా కుటుంబ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా భూమా శోభా, భూమా నాగిరెడ్డి దంపతుల మరణానంతరం ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కరువైంది. నంద్యాల ఉప ఎన్నికలో భూమా కుటుంబానికి చివరగా విజయం దక్కింది. ఆ తర్వాత ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ, నంద్యాలలో పోటీ చేసిన అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి వైసీపీ చేతిలో భారీ తేడాతో ఓటమిపాలయ్యారు.
మరీ ముఖ్యంగా ఓటమి అనంతరం తనది ఓటమే కాదని అఖిలప్రియ మాట్లాడటం ఆళ్లగడ్డతో పాటు కర్నూలు జిల్లాలో ఆమెపై వ్యతిరేకత పెంచింది. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సర్వసాధారణం. వాటిని సమానంగా స్వీకరించిన వారే రాజకీయాల్లో రాణిస్తారు. కానీ అఖిలప్రియ తాను ఆళ్లగడ్డ రాజ్యానికి రారాణి , యువరాణి అనుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆమె అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ అధికారం కోల్పోయిందన్న విషయాన్ని మరిచి, తామేం చేసినా ప్రశ్నించేవారే లేరనే లెక్కలేని తనంతో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి నిదర్శనమే అఖిలప్రియ సమీప బంధువు, వ్యాపార భాగస్వామి అయిన శివరామిరెడ్డికి చెందిన క్రషర్ మిషన్‌కు తాళాలు వేసి ఆక్రమించాలనే ప్రయత్నాలని ఆమె బంధువులు గగ్గోలు పెడుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి భార్గవ్‌రామ్‌పై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి భార్గవ్ పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని మరో కేసు నమోదైంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో సొంతింటిలో భార్గవ్ ఉన్నాడనే సమాచారంతో వెళ్లిన ఆళ్లగడ్డ పోలీసులపై మాజీ మంత్రి అఖిలప్రియ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్మల్ని ఏమనుకుంటున్నారు? నేనెవరిని అనుకుంటున్నారు? అని దబాయింపు, అహంకార స్వరంతో ఆమె ప్రశ్నించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చినికి చినికి గాలివానగా మారినట్టు కుటుంబ, వ్యాపార సంబంధ గొడవ కాస్తా రాజకీయ రంగు పులుముకొంది. ఈ విధంగా వైసీపీతో పాటు పోలీసులను, బంధువులను ఆత్మరక్షణలో పడేసి తాను పైచేయి సాధించాలని అఖిలప్రియ ఎత్తుగడ వేసినట్టు కర్నూలు జిల్లా ప్రజానీకం భావిస్తున్నారు.
సంచలనాలతో, రౌడీయిజంతో ఇమేజ్‌ను సంపాదించుకోవాలనే ఛీప్‌ట్రిక్స్ రాజకీయాలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదని, సోదరుడు బ్రహ్మానందరెడ్డికి ఆమె రాజకీయాలు గిట్టకపోవడంతో మౌనముని అయ్యాడని సొంతవాళ్లే చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అఖిలప్రియపై ప్రభుత్వం ఎక్కడ వేధింపులకు పాల్పడుతోందో అర్థం కావడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. క్రషర్ మిషన్‌కు సంబంధించి కొంత కాలంగా గొడవ జరుగుతున్న మాట వాస్తవమేనని ఆమే చెబుతున్నప్పుడు, వేధింపుల ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతున్నదో చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు గవర్నర్ వద్దకు వెళ్లినట్టే ఆళ్లగడ్డకు వచ్చి విచారణ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయని ఇటు అఖిలప్రియ ప్రత్యర్థులు, బంధువులు, పోలీసులు హితవు పలుకుతున్నారు. వేధింపులపై అఖిలప్రియకే పేటెంట్ హక్కులున్నట్టుగా వ్యవహరిస్తున్న పచ్చినిజం బయటపడుతుందని వారు అంటున్నారు.