iDreamPost
android-app
ios-app

బ‌డ్జెట్ లో ఎన్ని”క‌ళ”‌‌లో..!

బ‌డ్జెట్ లో ఎన్ని”క‌ళ”‌‌లో..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్ర‌జాకార్యం, స్వ‌కార్యం రెండూ నెర‌వేరేలా తీవ్ర క‌స‌ర‌త్తు చేసి రూపొందించిన‌ట్లు క‌నిపిస్తోంది. వరుసగా మూడోసారి కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సీతారామ‌న్ ఈసారి రాజ‌కీయ చ‌తుర‌త‌ను కూడా ప్ర‌ద‌ర్శించారు. సృజనాత్మకత, సామర్థ్యం, నాయకత్వం, మానవ వనరులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వనరులు వంటి 6 అంశాల ఆధారంగా ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన‌ట్లుగా క‌నిపిస్తున్నా.. 7వ అంశం కూడా అంత‌ర్లీనంగా క‌నిపిస్తోంది. అదే ఎన్నిక‌లు. బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌లో అతి త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే రాష్ట్రాల‌ను దృష్టిలో పెట్టుకున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆయా రాష్ట్రాల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇప్ప‌టికే అక్క‌డి పార్టీల‌తో నువ్వా – నేనా రీతిలో రాజ‌కీయంగా పోరాడుతోంది. బీజేపీ ప్ర‌భుత్వం బ‌డ్జెట్ లో ఆయా రాష్ట్రాల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది.

మ‌రోవైపు రైతు ఉద్య‌మాన్ని కూడా ఈ బ‌డ్జెట్ లో దృష్టిలో పెట్టుకున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచే అంశాలపై దృష్టి సారించామంటూ వారిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. వ్య‌వ‌సాయ‌, రైతుల సంక్షేమానికి రూ.1,31,531 కోట్లు కేటాయించి త‌మ‌ది రైతు ప్ర‌భుత్వ‌మనే చెప్పుకుంటోంది. అంతేకాకుండా అన్నదాతలు సులభంగా రుణాలు పొందగలుగుతారని, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి (అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌) సాయంతో ఏపీఎంసీ మార్కెట్లను బలోపేతం చేసేందుకు బాటలు వేశామ‌ని చెప్పుకుంటూ కొత్త చ‌ట్టాల ద్వారా రైతులు ఏ న‌ష్టాల‌ను తెర‌పైకి తెస్తున్నారో వాటికి ప‌రిష్కారం చూపే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాకుండా బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా రైతుల‌కు చ‌ర్చ‌ల సందేశాన్ని కూడా నిర్మ‌ల పంపారు. కొంద‌రు నేత‌లు త‌మ ప్ర‌యోజ‌నాల కోసం రైతుల‌ను వినియోగించుకుంటున్నారంటూ విమ‌ర్శ‌లు సంధించారు. చ‌ర్చ‌ల ద్వారానే రైతు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్క‌రం ల‌భిస్తుంద‌ని చెబుతూ.. బ‌డ్జెట్ లో రైతు ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకున్నామ‌న్నారు.

బీజేపీ పెద్ద‌ల సూచ‌న‌లను నిర్మ‌ల‌మ్మ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని రాబోయే నాలుగైదు నెల‌ల్లో.. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పెద్ద పీట వేశారు. అధిక నిధులు కేటాయించి తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాలపై వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా తమిళనాడు, బెంగాల్‌పై బడ్జెట్‌లో స్పష్టమైన మార్కును చూపెట్టింది. తమిళనాడులో రోడ్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. రూ.లక్ష కోట్లతో రోడ్ల అభివృద్ధితో పాటు లక్షా 18వేల కి.మీ మేర రైల్వే లైన్ల అభివృద్ధికి కేటాయింపులు జరిపింది. పశ్చిమ బెంగాల్‌లో 25 వేల కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తమిళనాడులో రహదారలు అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు. అస్సాంలో రహదారుల అభివృద్ధికి 19వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసుల అభివృద్ధికి రూ.18వేల కోట్లు నిధులను తమిళనాడుకు సమకూర్చింది. రానున్న మరో ఆరునెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలను ఆకర్శించే విధంగా నిధుల కేటాయింపులు జరిపింది.

మరోవైపు ఈ ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న బెంగాల్‌పై సైతం కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. మౌలిక వసతుల కల్పన, రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. బెంగాల్‌లో 675 కి.మీ మేర జాతీయ రహదారుల అభివృద్ధికి తాజా బడ్జెట్‌లో నిధులు సమీకరించింది. మొత్తం రాష్ట్రానికి దాదాపు 95 వేల కోట్ల వరకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసింది. అసోం, బెంగాల్‌, కేరళలో ఐదు ప్రత్యేక జాతీయ అభివృద్దికి నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఈ కేరళకు సైతం నిధులు భాగానే వడ్డించింది. కొచ్చి మెట్రోరైలు ఫేజ్‌-2 అభివృద్ధికి రూ.1957 కోట్లు కేటాయింపులు జరిపింది. దాదాపు 65 వేల కోట్ల రూపాయాలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపింది. మరోవైపు బెంగళూరు, నాగ్‌పూర్‌, కొచ్చి మెట్రోరైలు అభివృద్ధికి భారీగా నిధులు ఇచ్చింది. బెంగళూరు మెట్రోరైలు అభివృద్ధికి రూ.14,788 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. మరోవైపు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంపై కూడా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌ వరాల జల్లు కురిపించింది. అసోంలో మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు జరిపింది.

ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వ‌డం ఇత‌ర రాష్ట్రాల నేత‌ల‌కు ఒకింత ఆగ్ర‌హం క‌ల‌గజేస్తోంది. ఇది ఎన్నిక‌ల బ‌డ్జెట్ అని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. అసాధార‌ణ స‌మ‌యంలో.. బ‌డ్జెట్ లో అంద‌రినీ మెప్పించాల్సిన బ‌డ్జెట్ ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌నే మెప్పించే ప్ర‌య‌త్నం చేసింద‌ని కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష నేత అధీర్ రంజ‌న్ చౌదురి ఆరోపించారు. బ‌డ్జెట్ చ‌లా చ‌ప్ప‌గా ఉంద‌ని వ్యాఖ్యానించారు. బ‌డ్జెట్ లో ఎన్నిక‌ల జిమ్మిక్కులు ప్ర‌ద‌ర్శించార‌ని ఆయా రాష్ట్రాల నేత‌లు ఆరోపిస్తున్నారు. ‘‘ఈ బడ్జెట్‌ ఎలా ఉందని మన రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్రాను అడిగాను. మాటలతో ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసేలా ఉందని చెప్పారు’’ అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘‘అసలు ఇదేం బడ్జెట్‌.. ఇదో నకిలీ బడ్జెట్‌. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక.. దేశ వ్యతిరేక బడ్జెట్‌ ఇది. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచారు. సెస్‌లు విధించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదు. రైతులు నష్టపోతారు. 15 లక్షల రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పారు. ఇప్పుడేం జరిగింది’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.