iDreamPost
android-app
ios-app

నిధులకు కేంద్రం కోత… నదుల అనుసంధానం సాధ్యమేనా?

  • Published Feb 18, 2022 | 9:55 AM Updated Updated Mar 11, 2022 | 10:18 PM
నిధులకు కేంద్రం కోత… నదుల అనుసంధానం సాధ్యమేనా?

దేశంలో నదుల అనుసంధానం అనేది శతాబ్ధకాలం నాటి ప్రతిపాదన. గోదావరి, కృష్ణా డెల్టాకు జీవంపోసిన సర్ ఆర్ధర్‌ కాటన్‌ హయాంలోనే గంగా నది నుంచి కావేరి నది వరకు అంటే ఉత్తర భారతం నుంచి దక్షణ భారతం వరకు నదులను అనుసంధానం చేయాలనే ప్రతిపాదన పురుడు పోసుకుంది. కానీ నాటినుంచి నేటివరకు ఇది ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానికి తెరదీసింది. గోదావరి – కావేరి అనుసంధానం చేయాలని ఇటీవల బడ్జెట్‌లో ప్రతిపాదించిన కేంద్రం దీనిపై ఉభయ తెలుగు రాష్ట్రాలను, తమిళనాడును ఒప్పించేందుకు సిద్ధమైంది.

దీనిలో భాగంగా న్యూఢిల్లీలో జాతీయ జల అభివృద్ధి సంస్థ ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో శుక్రవారం చర్చిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండడం… రాష్ట్రాల చేతిలో ఉన్న జలాల మీద పెత్తనం కేంద్రం చేతిలోకి వెళ్లిపోతోందనే విమర్శలు… కేంద్రం ఇవ్వాల్సిన వాటా కుదింపు… రాష్ట్రాలపై భారం ఇవన్నీ చూస్తే నదుల అనుసంధానం మరోసారి ప్రతిపాదనలతోనే నిలిచిపోతోందా? పట్టాలెక్కుతోందా? అనేది చూడాల్సి ఉంది.

మహానది నుంచి కావేరి వరకు నదులు అనుసంధానం చేయాలనే ప్రతిపాదన అటల్ బిహారీ వాజ్‌పాయి హయాంలో తెరమీదకు వచ్చినా ఆచరణలోకి రాలేదు. తాజాగా మోడీ ప్రభుత్వం గోదావరి నుంచి కృష్ణా, పెన్నా, కావేరి నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి, కృష్ణ నదులలో వృధాగా పోతున్న 247 టీఎంసీల నీరు వినియోగంలోకి వస్తోంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులోని కొత్తగా 23 లక్షల 41 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతోంది. అలాగే చెన్నై తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సౌకర్యం ఏర్పడుతోంది. అందరికన్నా తమిళనాడుకు ఇది చాలా ఉపయుక్తం. కావేరీలో నీటికి కర్ణాటక దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం పెద్దగా ఉండదు. గోదావరి నుంచి కావేరి వరకు జలరవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. రోడ్డు రవాణా కన్నా జలరవాణా వ్యయం మూడు రెట్లు తక్కువ. దీని వల్ల చమురు వంటి సహజ వనరుల వినియోగం తగ్గుతోంది. ఇన్ని విధాలుగా ప్రయోజనం ఉన్న ఈ ప్రాజెక్టు మీద విమర్శలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

నదుల అనుసంధానం వల్ల నదీగమనం మారిపోతోంది. దీని వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని పర్యావరణవేత్తల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్ర సింగ్‌ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే రాష్ట్రాల పరిధిలో ఉన్న జలాల వినియోగంపై కేంద్రం చేతుల్లోకి వెళిపోతోందని ఆయన ఆరోపిస్తున్నారు. అంతిమంగా నదులను కార్పోరేట్‌ పరం చేసేందుకు మోడీ ప్రభుత్వం బలమైన పునాదులు వేస్తోందని ఆయన విమర్శిస్తున్నారు.

నదుల అనుసంధానానికి కేంద్రం వాటాను గతంలో తగ్గించివేశారు. అప్పట్లో కేంద్రం 90 శాతం.. మిగిలిన నిధులను ఆయా రాష్ట్రాలు సమాన నిష్పత్తిలో భరించాలని ఉండేది. అయితే కేంద్రం తన వాటాను 60 శాతానికి కుదించుకుని, రాష్ట్రాల వాటాను 40 శాతం చేసింది. ప్రతిపాదిత గోదావరి – కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు నిర్మాణ అంచనా 2018-19లలో రూ.86 వేల కోట్లు కాగా, తాజాగా ఇది రూ.లక్ష కోట్లు చేరిందని అంచనా. ఇప్పటి నిబంధన ప్రకారం కేంద్రం రూ.60 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, మూడు రాష్ట్రాలు రూ.40 వేల కోట్లు భరించాల్సి ఉంది. అంటే ఒక్కొక్క రాష్ట్రం దగ్గర దగ్గరగా రూ.13 వేల 333 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. కరోనా తరువాత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తలక్రిందులైన నేపథ్యంలో రాష్ట్రాలు ఇందుకు సుముఖంగా ఉంటాయనే నమ్మకం కలగడం లేదు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం వాటాను 90 శాతం చేయాలని కేంద్ర జలసంఘం ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఇందుకు ఆర్థిక శాఖ నుంచి సానుకూల స్పందన వస్తేనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశముంది.

Also Read : కర్నూలు జిల్లాలో బంగారు గనులు -స్వతంత్ర భారతంలో ఏర్పాటుకానున్న తొలి గోల్డ్ మైన్