iDreamPost
iDreamPost
ఇదో విపత్కాలం. అగ్రరాజ్యాలుగా చెప్పుకునే వారు కూడా విలవిల్లాడుతున్న కాలం. విశ్వమంతా విజృంభిస్తున్న కరోనా కోరల్లో కలవరపడుతున్న సమయం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలో ఉన్నా సంయమనం పాటించాలి. సామాన్యులకు కాస్త భరోసా కల్పించాలి. అపోహలు చల్లార్చి, ఊరట కల్పించే విషయాలు ప్రచారం చేయాలి. కానీ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ పరిస్థితి అందుకు భిన్నం. ఇప్పటికీ రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తున్న తీరు విస్మయం. అధికారపక్షంతో సహకరించాల్సి ఉన్న దశలో తద్విరుద్ధంగా ఆటంకాలు కల్పించేందుకు కూడా వెనకూడకూడదని నిర్ణయించుకున్నట్టు ప్రతిపక్ష టీడీపీ తీరు కనిపిస్తోంది.
ఇరాన్ లో అపోహలు కారణంగా 300మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన ప్రపంచాన్ని కలచివేసింది. సోషల్ మీడియాతో పాటుగా రెగ్యులర్ మీడియాలో కొందరు నిర్ధారణ లేని సమాచారం ప్రచారం చేయడంతో పెద్ద ఆపదలు ఎదురవుతున్నాయి. ఈ విషయంపై పెద్ద పెద్ద మీడియా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అర్థసత్యాలు, అధికారయుతంగా స్పష్టత లేని సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. అయినా ఏపీలో టీడీపీ, వారి అనునాయులకు చెందిన మీడియాలో మాత్రం ఇష్టారాజ్యంగా సాగుతున్న ప్రసారాలు ప్రజలను మరింత కలవరపరిచేలా కనిపిస్తున్నాయి.
మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ మనమంతా ఒక్కటేనని చాటాల్సి ఉంది. కానీ టీడీపీ కి చెందిన సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు కూడా హద్దులు మీరుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే బుద్ధా వెంకన్న వంటి నేతలకు బుచ్చయ్య వంటి వారు తోడు కావడంతో ఇక సాధారణ కార్యకర్తలు ఎందుకు సైలెంట్ ఉంటారనే ప్రశ్న ఎదురవుతోంది. దాంతో ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మత కార్యక్రమంలో పాల్గొన్న వారిలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించిన కారణంగా దేశమంతా అప్రమత్తమయ్యింది. అన్ని రాష్ట్రాల్లోనూ అలాంటి వారి వివరాలు సేకరించే పనిలో ఉంది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలో కాతేరు అనే గ్రామం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సొంతూరు. అక్కడ ఏకంగా కరోనా వల్ల ముగ్గురు మృతి చెందారంటూ బుచ్చయ్య అధికారిక పేజీలో రాసిన రాతలు అలజడి రేపుతున్నాయి.
వాస్తవానికి కాతేరు నుంచి కూడా ఢిల్లీ సమావేశానికి వెళ్లారు. వారిని పరీక్షించారు. నెగిటివ్ అని రిపోర్టులు వచ్చాయి. అయినా 62ఏళ్ల వృద్ధుడు మరణించారు. దాంతో కరోనా లక్షణాలతో మరణించారనే అనుమానాలున్నాయి. అలాంటి అనుమానాల ఆధారంగా అందరికీ అదే వాస్తవం అని చెప్పడం బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వారికి తగదని అందరికీ తెలుసు. అయినా టీడీపీ నేతలకు అది పట్టడం లేదు. అధినేత హైదరాబాద్ లో ఉండగా, మిగిలిన వారు ఇలాంటి ప్రచారాలకు పూనుకోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం రెండు పూటలా బులిటెన్స్ విడుదల చేస్తున్న తరుణంలో వాటి ఆధారంగా పోస్టులు పెట్టినా తప్పులేదు. వాటి మీద అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయడం నేరం కూడా కాదు. కానీ లేని పోని సమాచారం ప్రజల్లో వదిలితే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారన్నది టీడీపీ నేతలకు, వారి మీడియాకు తెలియనది కాదు. అయినా ఇలంటి ప్రచారం విషయంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది.