వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణను సిట్ నుండి సిబిఐ కి అప్పగించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టును ఆశ్రయించారు. సిట్ విచారణలో అసలు దోషులు బయటకు రారని అందుకే వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణను సిబిఐ కి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో జరిగిన వివేకా హత్యలో వివేకానంద రెడ్డి సన్నిహితులతో పాటు,పలువురు టీడీపీ నేతలకు కూడా సిట్ విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. వారిలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఉన్నారు.
బీటెక్ రవి తరపున మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్ వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసు దర్యాప్తును స్వతంత్ర సంస్థ చేపడితే అసలు దోషులు బయటకు వస్తారని, సిట్ పరిధి నుండి సిబిఐకి దర్యాప్తును అప్పగించాలని సల్మాన్ ఖుర్షిద్ పిటిషనర్ తరపున హైకోర్టును కోరారు. కాగా హైకోర్టు జనవరి 3కు తదుపరి విచారణను వాయిదా వేసింది. దీనితో వివేకా హత్య కేసును సిట్ పరిధి నుండి సిబిఐకి హైకోర్టు అప్పగిస్తుందో లేక సిట్ పరిధిలోనే ఉంచుతుందో జనవరి 3 న తేలనుంది.
కానీ వివేక హత్య కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రిగా పని చేసిన సల్మాన్ ఖుర్షిద్ ఎమ్మెల్సీ బిటెక్ రవి తరపున వాదన చేయడంపై రాజకీయవర్గాల్లో సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది.