విజయవాడలోని ఇంద్రకీలాద్రి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారాలు ముందే అప్రమత్తమయి హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. కానీ ఈలోగా కొండమీద మౌనస్వామి ఆలయం వద్ద కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్నవారు పరుగులు తీశారు. కొండ చరియలు విరిగిపడటంతో ఓ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
కొద్దిసేపట్లో సీఎం జగన్ దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి రానున్న నేపథ్యంలో కొండచరియలు విరిగిపడడంతో అధికారుల అప్రమత్తమై సహాయక చర్యలు వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇంద్రకీలాద్రికి రానున్న నేపథ్యంలో ఆ ప్రదేశంలో రాకపోకలు నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని పలువురు చెబుతున్నారు.ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడడంతో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోగిరమేష్, వసంత కృష్ణ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు.