iDreamPost
android-app
ios-app

కడపలో బయటపడ్డ ‘బ్రిటీష్’ బంకర్ జైలు..

కడపలో బయటపడ్డ ‘బ్రిటీష్’ బంకర్ జైలు..

సాధారణంగా పురావస్తు నిర్మాణాలు అంటే అందరికీ ఆసక్తే. ఆ మధ్య ఢిల్లీ అసెంబ్లీలో సభ్యులు సమావేశమయ్యే ప్రదేశంలో ఓ సొరంగం కనిపించింది. అసెంబ్లీ నుంచి చారిత్రాత్మక కట్టడం రెడ్ ఫోర్ట్ కి వెళ్లేలా దాన్ని నిర్మించినట్లు కనుగొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ భవన సముదాయం రెడ్ ఫోర్ట్ 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అన్ని కిలోమీటర్ల దూరం పాటు ఈ సొరంగం బయటపడింది. ఇప్పుడు అంటే టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చాక అనేక ఆసక్తికర నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ టెక్నాలజీ అందుబాటులో లేకున్నా సైంటిఫిక్ గా అద్భుతమైన విలువలున్న అనేక పురావస్తు నిర్మాణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలలో అనేక పురావస్తు నిర్మాణాలు ఉన్నాయి.

అలాగే ఇప్పుడు అదే కడప జిల్లాలో అద్భుత నిర్మాణం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ ఆగ్రహారంలోని బుగ్గమల్లేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో సొరంగ కారాగారం ఒకటి బయట పడింది. మైదుకూరుకు చెందిన నేస్తం సేవా సంస్థ ప్రతినిధి బాల నాగిరెడ్డి బుగ్గవంక ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లారు. ఈ సమయంలో భూమి పైభాగంలో ఒక చిన్నపాటి రంధ్రాన్ని గుర్తించారు. అందులోకి దిగి పరిశీలించగా లోపల అద్భుతమైన నిర్మాణం బయటపడింది. ఇక ఈ నిర్మాణం గురించి సమచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు.

ఈ కారాగారం బ్రిటీష్ కాలం నాటిదని చిత్తూరు, కడప పురావస్తుశాఖ ఏడీ శివకుమార్ తెలిపారు. దీన్ని బంకరుగా, గోదాంగానూ ఉపయోగించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిర్మాణాలను బ్రిటీషర్లు రైల్వే ట్రాకు సమీపంలో నిర్మించేవారని ఆయన వెల్లడించారు. అయితే కారాగారం లోపల ఎలాంటి వాడకం లేకపోవడంతో ప్రస్తుతం గబ్బిలాలు, మురికి నీటితో కూడి అపరిశుభ్రంగా ఉంది. కారాగారం లోపలికి దిగడానికి పెద్దపెద్ద రంధ్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వెలుగులోకి రావడంతో దాన్ని శుభ్రం చేసి సందర్శకుల కోసం అందుబాటులోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.