iDreamPost
android-app
ios-app

Rajamahendravaram Bridges – ప్రగతికి వంతెనలు.. గోదారి మాతకు వడ్డాణాలవి!

  • Published Oct 14, 2021 | 7:32 AM Updated Updated Oct 14, 2021 | 7:32 AM
Rajamahendravaram Bridges – ప్రగతికి వంతెనలు.. గోదారి మాతకు వడ్డాణాలవి!

రాజమహేంద్రవరం మీదుగా రైలు ప్రయాణం చేసేవారు సరిగ్గా ఆ వంతెనలు వచ్చేసరికి ఒక్కసారిగా అలర్ట్‌ అవుతారు. తమ సీట్ల నుంచి గోదావరి మాతకు దణ్ణం పెట్టుకొనే వారు కొందరు, కిటికీ గుండా డబ్బులు గోదావరిలోకి విసిరేవారు కొందరు, మహిళలైతే ఇంటివద్ద నుంచి పొట్లం కట్టి తెచ్చుకున్న పసుపు కుంకుమలు గోదారికి సమర్పించేవారు మరికొందరు. చాలామంది కన్నార్పకుండా గోదావరిపై ఉన్న నాలుగు వంతెనలు చూస్తుంటారు. అంత లోతు నీళ్ళల్లో ఇంజినీరింగ్ పని తనానికి ప్రతీకగా నిలబడి ఉన్న స్తంభాలు, వాటిపై వేగంగా సాగిపోయే వాహనాలు.. ఓహ్.. మానవుడు మహనీయుడు అనిపిస్తుంది. గోదావరి మాతకు వఢ్ఢాణాలు అమర్చినట్టు ఉండే ఆ వంతెనలను అందుకే అందరినీ అలరిస్తుంటాయి. వీటిలో ఒక్కో వంతెనది ఒక్కో చరిత్ర. అదోసారి పరిశీలిద్దాం.

పాత రైలు బ్రిడ్జి..

రాజమహేంద్రవరం వద్ద గోదావరిపై 1897 సంవత్సరంలో రైలు బ్రిడ్డి నిర్మించారు.  దీనిని పాత రైలు బ్రిడ్డి, హేవలాక్‌ బ్రిడ్జి అని పిలుస్తారు. దీని 66 స్తంభాలను రాతితో కట్టారు. దానిపై ట్రాక్‌ నిర్మించారు. బ్రిటిష్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి ఇదో మచ్చుతునక అనవచ్చు. వందేళ్లకు పైబడి సేవలందించిన ఈ బ్రిడ్జిని రైల్వేశాఖ 1997 నుంచి వినియోగించడం లేదు. దీన్ని తొలగించాలని రైల్వేశాఖ భావించగా స్మృతి చిహ్నంగా ఉంచాలని స్థానిక ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేయడంతో ఆలాగే ఉంచేశారు.  అప్పటి జ్ఞాపకాలను పదిలపరుస్తూ దీనిపై ఒక మ్యూజియం నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ఇంకా కార్యరూపం దాల్చలేదు.

రైలు కం రోడ్డు బ్రిడ్డి

దీన్నే రాజమండ్రి – కొవ్వూరు బ్రిడ్డి అని కూడా పిలుస్తారు. 1974 ఆగస్టు16న దీన్ని ప్రారంభించారు.ఈ బ్రిడ్జి రైలు మార్గం 2.8 కిలోమీటర్లు, రోడ్డు మార్గం 4.1 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దేశంలోనే ఇది మూడో పొడవైన రోడ్డు కం రైలు బ్రిడ్డి. అస్సాం రాష్ట్రంలోని డిబ్రూఘర్‌ జిల్లాలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన బోగిబీల్‌ బ్రిడ్జి దేశంలోనే పొడవైన మొట్టమొదటి రోడ్డు కం రైల్‌ బ్రిడ్జి. రెండోది బీహార్‌ రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన డిఘా- సోన్‌పూర్‌ బ్రిడ్డి. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌ నిర్మించిన గ్రాప్ట్‌న్‌ బ్రిడ్జిలాగే ఇక్కడ కూడా రైలు వెళ్లేందుకు సింగిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. 27 స్తంభాలతో  91.5 మీటర్లతో ఏర్పాటు చేశారు. అందులో 745.72 మీటర్ల లోతు కట్టారు. బ్రాత్‌వైట్‌ అనే ఇంజినీర్‌ ఆధ్వర్యంలో దీని నిర్మాణం సాగింది. నాటి రాష్ట్రపతి ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ దీన్ని ప్రారంభించారు.

గోదావరి ఆర్చ్‌ బ్రిడ్జి

1997 మార్చి 12న ఇది ప్రారంభమైంది. ఇది హేవలాక్‌ స్థానంలో వచ్చిన రైలు బ్రిడ్జి. 28 స్తంభాలతో, స్తంభానికి రెండేసి ఆర్చ్‌లతో ఈ బ్రిడ్జి నిర్మించారు. హిందూస్థాన్‌ కనస్ట్రక‌్షన్‌ కంపెనీ దీని నిర్మాణం 1991 ప్రారంభించి 1997లో ముగించింది. 160 కిలోమీటర్ల స్పీడుతో రైలు వెళ్లినా, తుపాను సమయంలో 200 కిలోమీటర్లకు పైబడిన వేగంతో గాలులు వీచినా తట్టుకొనేలా దీన్ని నిర్మించారు.

నాలుగో బ్రిడ్జి..

రాజమహేంద్రవరంలోని దివాన్‌చెరువు నుంచి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరును రోడ్డు మార్గంతో ఈ బ్రిడ్డి కలుపుతుంది. వాహనాల రాకపోకలకు వీలుగా ఈ బ్రిడ్డిని రెండు వంతెనలతో నిర్మించారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. 2012 పూర్తి చేయాలనేది లక్ష్యం కాగా 2015కి పూర్తయింది. రూ.512 కోట్ల అంచనా వ్యయం రూ.800 కోట్లకు పెరిగింది. దీన్ని గామన్‌ ఇండియా సంస్థ నిర్మించింది. ఈ బ్రిడ్డి వల్ల రాజమహేంద్రవరంపై ట్రాఫిక్‌ వత్తిడి తగ్గుతుంది. కోల్‌కతా నుంచి చెన్నైకు 150 కిలోమీటర్ల ప్రయాణం కలసిరావాలనే ఉద్దేశంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలు రావులపాలెం నుంచి కాకుండా ఈ బ్రిడ్జి మించి వెళ్లడం వల్ల 45 కిలోమీటర్ల దూరం కలసి వస్తుంది.

ప్రగతికి చిహ్నంగా..

రాజమండ్రి నుంచి కొవ్వూరు వెళ్లడానికి, వస్తు రవాణాకు పడవ ప్రయాణమే దిక్కుగా ఉన్న రోజుల్లో నిర్మించిన రైలు వంతెన మొదలుగా ఏర్పడీన ఈ నాలుగు బ్రిడ్జిలు అభివృధ్ధికి ప్రతీకగా నిలిచాయి. ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీ రాక ముందు కరువు కాటకాలతో అల్లాడిన ఈ ప్రాంతం 1853లో దాని నిర్మాణం పూర్తి అయ్యాక ఉభయగోదావరి జిల్లాలు దేశానికే ధాన్యాగారంగా ప్రసిద్ది పొందాయి. అదేవిధంగా ఒక్కొక్కటిగా నిర్మాణం పూర్తి చేసుకొని ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్దికి ఈ వంతెనలు నిలువెత్తు నిదర్శనంగా నిలుచున్నాయి.