iDreamPost
android-app
ios-app

ఈటల పాదయాత్రకు బ్రేక్.. వాట్ నెక్స్ట్?

  • Published Jul 31, 2021 | 12:41 PM Updated Updated Jul 31, 2021 | 12:41 PM
ఈటల పాదయాత్రకు బ్రేక్.. వాట్ నెక్స్ట్?

టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి.. బీజేపీలో చేరి.. తన రాజకీయ భవిష్యత్తు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. ఉప ఎన్నికలో చావా రోవే తేల్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. 12 రోజుల నుంచి ప్రజా దీవెన పాదయాత్ర చేస్తున్నారు. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. తన పాదయాత్రకు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తర్వాతి స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న ఆయన.. మళ్లీ ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తారనేది కీలకంగా మారింది.

పాదయాత్రకు మంచి రెస్పాన్స్..

టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలన్నింటినీ ఈటల చుట్టేస్తున్నారు. పలు పల్లెల్లో పర్యటించారు. బీజేపీ లీడర్లు, గతంలో తన టీఆర్ఎస్‌లో ఉన్న లీడర్ల నుంచి మద్దతు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జులై 19న ప్రజా దీవెన పాదయాత్రను ఈటల ప్రారంభించారు. 220 పైగా కిలోమీటర్లు నడిచారు. శుక్రవారం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి, గొల్లపల్లి, హిమ్మత్ నగర్, మారంపల్లి, రామకృష్ణాపూర్ తదితర గ్రామాల మీదుగా ముందుకు సాగారు. పోతిరెడ్డిపల్లి నుంచి కొండపాకకు చేరుకోగానే ఈట‍ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో పాటు కాళ్లకు పొక్కులు వచ్చాయి. దీంతో అక్కడే బస్​లో ఆయన ప్రాథమిక చికిత్స చేశారు. పాదయాత్రను నిలిపేసి హుజూరాబాద్ లోని తన ఇంటికి వెళ్లారు. ప్రస్తుతానికి ఆయన యాత్రకు బ్రేక్ పడినా.. ఇప్పటిదాకా సాగిన యాత్రలో ఆయనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పలు పల్లెల్లో స్థానికులు ఆయనకు బహిరంగంగానే మద్దతు పలికారు. వెంట నడుస్తామని భరోసా ఇచ్చారు.

ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి..

పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడ్నుంచే మళ్లీ ప్రారంభిస్తానని ఈటల రాజేందర్ అంటున్నారు. ప్రజల కొండంత దీవెనలతో మళ్లీ ప్రజా దీవెన యాత్ర ప్రారంభిస్తామని చెబుతున్నారు. అయితే ఎప్పుడు మొదలవుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఈటల ప్రస్తుతం చాలా వీక్‌గా ఉన్నారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. బీపీ, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయి. షుగర్ లెవెల్స్ పెరిగాయి. దీంతో పాదయాత్రకు కనీసం 10 నుంచి 20 రోజులు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఈటల పూర్తి కోలుకున్న తర్వాత పాదయాత్ర మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని బీజేపీ లీడర్లు చెబుతున్నారు. ఆరోగ్యం కాస్త మెరుగయ్యాక నడక ప్రారంభిస్తే మళ్లీ అస్వస్థతకు గురి కావచ్చని అంటున్నారు.

టీఆర్ఎస్‌కు మంచి చాన్స్

ఈటల రాజేందర్ విషయంలో టీఆర్ఎస్, కేసీఆర్ తీరుపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో ఈటలపై హుజూరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రమంతటా సానుభూతి ఏర్పడింది. టీఆర్ఎస్‌పై వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌‌ను ఓడించేందుకు కేసీఆర్ శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దళిత బంధును అక్కడి నుంచే అమలు చేస్తామని చెప్పి.. సంచలనం రేపారు. హుజూరాబాద్‌లో 40 వేలకు పైగా దళితుల ఓట్లు ఉన్నాయి. కానీ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభించడం, ఆయన భార్య జమున ఇంటింటి ప్రచారం చేస్తుండటంతో టీఆర్ఎస్, ఈటల మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. ఇప్పుడు ఈటల పాదయాత్ర ఆగిపోవడం ఒక రకంగా టీఆర్ఎస్‌కు కలిసి రానుంది. ఈటల అస్వస్థతకు గురి కావడం వల్ల ఆయనకు సానుభూతి దక్కినా.. ప్రజల్లో ఉండకపోవడం ఒక విధంగా మైనస్సే. దీంతో టీఆర్ఎస్ మరింతగా ప్రజల్లోకి వెళ్లనుంది.

Also Read : ఈటల మాటల తూటాలకు టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి