భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ భారత్ తన అమ్ములపొదిలోని ఆయుధాలకు పదును పెడుతుంది. గత నెల రోజుల్లో 10 క్షిపణి ప్రయోగాలు జరిపిన భారత్ తాజాగా మరో క్షిపణిని ప్రయోగించింది. ఈ ఆదివారం పరీక్షించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని చేధించింది.. ఈ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించగలవు.
దేశీయంగా నిర్మించిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ చెన్నై నుంచి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించగా అరేబియా సముద్రంలో ఉన్న లక్ష్యాన్ని చేధించింది. తక్కువ పరిధి ర్యామ్‌జెట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్‌ను ఉపరితలం నుండి, సముద్రంలోని యుద్ధ నౌకల నుంచి, సముద్రం లోపల జలాంతర్గాముల నుంచి, గాలిలో యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు.ఈ ఆయుధంతో ఇండియన్ నేవీ బలం మరింత పెరిగిందని డీఆర్డీఓ తెలిపింది.
బ్రహ్మోస్ క్షిపణికి ఆ పేరు ఎలా వచ్చింది?
భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీఓ మరియు రష్యాకు చెందిన మషినో స్ట్రోయేనియాలు సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసి, భారత్‌లో బ్రహ్మోస్ క్షిపణిని తయారు చేస్తున్నాయి. భారతదేశంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది రష్యాలో ప్రవహించే మాస్కో నదుల పేర్లలోని మొదటి భాగాలను కలిపి బ్రహ్మోస్ గా నామకరణం చేశారు. రష్యా క్రూయిజ్ క్షిపణి P-800 ఓనిక్స్ సాంకేతికత ఆధారంగా ఈ క్షిపణిని రూపొందించారు.
క్షిపణి ప్రయోగం విజయవంతమైన సందర్భంగా డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి. సతీశ్ రెడ్డిని, శాస్త్రవేత్తలను, డీఆర్డిఓ, బ్రహ్మోస్, ఇండియన్ నేవీ సిబ్బందిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.