iDreamPost
android-app
ios-app

పెద్దాపురం పై బొడ్డు వారసుడి గురి…..

  • Published Sep 15, 2021 | 8:45 AM Updated Updated Sep 15, 2021 | 8:45 AM
పెద్దాపురం పై బొడ్డు వారసుడి గురి…..

బొడ్డు భాస్కర రామారావు.. తూర్పుగోదావరి జిల్లా వాసులకు పరిచయం అక్కరలేని పేరు. జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన వ్యక్తి.

2021లో కోవిడ్ కు గురిఅయి మే రెండో తేదీన విశాఖపట్నం ఆస్పత్రిలో భాస్కరరామారావు కన్నుమూశారు. ఆయన గురించి ఇప్పుడు పెద్దాపురం నియోజకవర్గంలో తరచుగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అయన కుమారుడు బొడ్డు వెంకట రమణ చౌదరి 2024 ఎన్నికల్లో పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భాస్కర రామారావు విలక్షణమైన వ్యక్తిత్వంపై, రాజకీయాల్లో ఆయన వేసిన ముద్రపై నియోజకవర్గంలో జనం చర్చించుకుంటున్నారు.

దత్తతకు వెళ్లినా చక్రం తిప్పింది ఇక్కడే..

కమ్మ సామాజిక వర్గానికి చెందిన భాస్కర రామారావు సామర్లకోట మండలం వేట్లపాలెంలో కొండపల్లి వారి కుటుంబంలో పుట్టారు. పెదపూడి మండలం పెద్దాడకు చెందిన బొడ్డు వెంకన్న కుటుంబానికి దత్తత వెళ్ళారు. దాంతో అప్పటి నుంచి పెద్దాడ లో నివాసం ఏర్పరచుకున్నారు. అయితే పెద్దాపురం నియోజకవర్గంలో ఎక్కువగా బంధువర్గం ఉండడంతో పెద్దాపురం నియోజకవర్గం నుంచే రాజకీయ చక్రం తిప్పారు. అటు తల్లితండ్రుల నుంచి తన వాటాగా వచ్చిన ఆస్తికి దత్తతకు వెళ్లిన ఇంటి ఆస్తి కలిసింది. దీనికితోడు అత్తవారి ఆస్తి కూడా కలిసి రావడంతో ఆర్థికంగా ఓ ప్రబల శక్తిగా ఎదిగారని చెప్పుకుంటారు.

రాయవరం మున్సబు శిష్యుడిగా..

జిల్లా రాజకీయాల్లో కింగ్ మేకర్ గా ప్రఖ్యాతులైన రాయవరం మున్సబు ఉండవల్లి సత్యనారాయణమూర్తి శిష్యునిగా భాస్కర రామారావు తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. పెద్దాడ సొసైటీ ప్రెసిడెంట్ గా గెలిచి తొలిసారిగా రాజకీయ పదవిని చేపట్టారు. తర్వాత సామర్లకోట, పెదపూడి, కాకినాడ రూరల్ మండలాలు ఉన్న సమితికి అధ్యక్షునిగా పనిచేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో పార్టీలో పట్టు ఉన్న ఆయన అప్పటివరకూ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న పంతం పద్మనాభంను ఆ పదవి నుంచి దింపి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.

Also Read : బాబు మర్చిపోయారు.. జగన్ చేసి చూపించారు!

1994 , 1999 పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2004లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

కుమారుడి కోసం తొలి యత్నం..

2014 ఎన్నికలకు ముందు తనకు ఎంతో పలుకుబడి ఉన్న తెలుగుదేశం పార్టీకి అనూహ్యంగా ఆయన గుడ్ బై చెప్పేసి వైఎస్సార్ సీపీలోకి చేరారు. తన కుమారుడు బొడ్డు వెంకటరమణ చౌదరికి రాజమహేంద్రవరం ఎంపీ టిక్కెట్టును సంపాదించారు .అయితే ఆయన కుమారుడు సినీనటుడు మాగంటి మురళీ మోహన్ చేతిలో ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో భాస్కర రామారావు టీడీపీలో చేరారు. అప్పటి నుంచి తెలుగుదేశంలోనే కొనసాగారు.

వెంకట రమణ చౌదరి చూపు ఎటు?

రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన కుమారుడు వెంకటరమణ చౌదరి రాజకీయాలకు దూరంగా వున్నారు. ఇప్పుడు తండ్రి మరణం అనంతరం మళ్లీ రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామర్లకోట మండలం వేట్లపాలెంలో బొడ్డు భాస్కర రామారావు విగ్రహం ఏర్పాటు చేయడానికి చురుకుగా పనులు జరుగుతున్నాయి విగ్రహావిష్కరణ తర్వాత నియోజకవర్గ పరిధిలోని ప్రముఖులను కలుసుకుని ఆయన తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది .అయితే బొడ్డు వెంకటరమణ చౌదరి టీడీపీలోనే ఉంటారా లేక వైఎస్సార్ సీపీ లోకి వెళతారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఆయన అనుచరులు మాత్రం వెంకటరమణ చౌదరి వైఎస్సార్ సీపీలోకే వెళతారనే అంటున్నారు.

Also Read : మొదటి మహిళా స్పీకర్ రాజకీయ ప్రస్థానం ముగిసిందా..??