Idream media
Idream media
అమెరికాలో మా అబ్బాయి చైనా వాళ్ల షాపులో బొబ్బా టీ తాగించాడు. అది తీయగా ఉండి, మధ్యలో స్పాంజ్‌లాంటి గోలీలు తగులుతూ ఉంటాయి. బాగానే ఉంది కానీ, టీ అంటే నా మైండ్‌లో రిజిస్టరయిన రుచి వేరు.
చిన్నప్పుడు మా ఇంట్లో టీ తాగే అలవాటు లేదు. డికాక్షన్ కాఫీనే. దాన్ని వడగట్టడానికి ప్రత్యేకమైన బట్ట వుండేది. టీ తాగాలంటే హోటలే. రాయదుర్గం లక్ష్మీబజార్‌లో లక్ష్మీ విలాస్ అనే హోటల్ వుండేది. ఉడిపి నుంచి వచ్చిన నారాయణస్వామి నడిపేవాడు. ఆయనకి ఆరుగురు పిల్లలు. హోటల్‌లో 10 మంది పనివాళ్లు. హోటల్ బాగా నడిచేది. దోసె, వడ రుచి 50 ఏళ్ల తర్వాత కూడా గుర్తున్నాయి. స్వామి పోయిన తర్వాత ఆయన కొడుకు శ్రీకాంత్ కొంత కాలం నడిపి మూసేశాడు. నేను మొదటి టీని ఇక్కడ తాగినట్టు గుర్తు. హోటల్‌లో పెద్ద రేడియో ఎప్పుడూ గురగురమని అరుస్తూ వుండేది. కౌంటర్‌లో స్వామి ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ పలకరించేవాడు. అదే ఆయన విజయ రహస్యమేమో! కాలం ఒక ముసలి మంత్రగత్తె. మన చుట్టూ ఉన్న మనుషులందరినీ మాయం చేస్తుంది. మనమూ ఒక రోజు మాయమవుతాం. అది మన చుట్టూ ఉన్న వాళ్లకి తెలుస్తుంది. మనకి తెలియదు.
అదే రోడ్డులో సుంకన్న, బొజ్జప్ప హోటళ్లు వుండేవి. అవి చిన్నవి. గుడిసెల్లో వుండేవి. అక్కడ వొగ్గాని , పిండి మిరపకాయలు (బజ్జీలు), టీ అమ్మేవాళ్లు. కొంచెం పెద్దయిన తర్వాత నేను, నా మిత్రుడు శేఖర్ కలిసి దొంగగా సుంకన్న హోటల్‌లో వొగ్గాని, టీ లాగించేవాళ్లం. ఇంట్లో వాళ్లు చూస్తే తిడతారు కాబట్టి రహస్య టీ సేవనం. ఆ రోజుల్లో వొగ్గాని 10 పైసలు, టీ 5 పైసలు.
బొజ్జప్ప హోటల్‌కి వెళ్లేవాన్ని కాను. ఆయన కూతురు పార్వతి స్కూల్లో నా క్లాస్‌మేట్, పెద్ద నోరుతో అరిచేది. ఐదుతో చదువు మాన్పించారు. బొంబాయి సంబంధమని 12 ఏళ్లకే పెళ్లి చేశారు. ఇప్పుడా పిల్లకి మునిమనువుళ్లు ఉన్నా ఆశ్చర్యం లేదు. బొజ్జప్ప ఖాకీ అంగి , నిక్కర్‌తో లావుగా వుండేవాడు. సాయంత్రం 4 గంటల నుంచి హోటల్ ముందర బాణలి పెట్టి బజ్జీలు వేసేవాడు. ఒక బజ్జీ 5 పైసలు. ఆయనికి సోడాల అంగడి కూడా వుండేది. బస్సులు ఆగినప్పుడు ఆయన ఇద్దరు మగపిల్లలు “సోడా సోడా” అని అరుస్తూ అమ్మేవాళ్లు.
సుంకన్నకి గవిసిద్ద అనే కొడుకుండేవాడు. బళ్లారిలో కూలి పనికి వెళ్లి బండమీద పడి చనిపోయాడు. అందరితో చెప్పుకుని సుంకన్న ఏడుస్తూ వుండేవాడు. మల్లికార్జున అనేవాడు మెయిన్ బజారు వరకు తీసుకెళ్లి శంకర్ బేకరీలో బాదంపాలు అలవాటు చేశాడు కానీ, టీ , కాఫీల్లా బాదంపాలు రెగ్యులర్‌గా తాగలేం.
ఇంకొంచెం పెద్దై హైస్కూల్ వరకూ వచ్చాను. స్కూల్ దగ్గర కొట్టం హోటల్ వుండేది. దాన్ని నడిపే ఆయనకి టీ చెబితే, టీ అని లోపలికి వినిపించేలా అరిచి తానే టీ చేసుకుని తెచ్చేవాడు. లోపల ఎవరూ లేనప్పుడు ఎందుకు అరిచేవాడో తెలియదు.
అనంతపురానికి వచ్చే సరికి ఆరాం, రాయలసీమ, స్టార్ కేప్ ఇలా ఊరంతా ఇరానీ కాఫీలే. డిగ్రీకి వచ్చేసరికి సిగరెట్లు అలవాటై టీ చాలా మధురంగా అనిపించేది. యూనివర్సిటీలో టీ దుకాణాల దగ్గర చాలా ముచ్చట్లు నడిచేవి. తిరుపతిలో జర్నలిస్టుగా జాబ్ వచ్చేసరికి రెడ్డి క్యాంటీన్‌లో టీ తప్పని సరి అయింది. ఐదుగురు పిల్లలతో పేదరికాన్ని ధైర్యంగా ఈదిన రెడ్డి, క్యాంటీన్‌లో నాలుగు డబ్బులు సంపాదించుకున్నాడు. పిల్లల పెళ్లిళ్లు చేసి, కాళహస్తిలో హాయిగా బతికే కాలం వచ్చినపుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రయాణంలో అలసిపోయి విశ్రాంతి కోరుకున్నాడేమో!
99లో హైదరాబాద్ వచ్చినపుడు ఎక్కడ చూసినా ఇరానీ కేప్‌లే. రుచికరమైన టీలు తాగే రోజులొచ్చినప్పుడు నాకు సుగర్ వచ్చింది. చక్కెర లేకుండా ఇరానీ టీ ఇవ్వరు. కేప్‌లో కాఫీ తాగితే అది నేరం. అంత ఘోరంగా ఉంటుంది. చాలా సార్లు మొండిగా చక్కెరతోనే తాగేసేవాన్ని. ఇష్టంగా ప్రేమించిన కేప్‌ల్లో ఇప్పుడు చాలా మటుకు లేవు. స్నేహితులతో కబుర్లు, సిగరెట్ పొగలు, అరె చోటు …సమోసా పిలుపులు అన్నీ తప్పుకున్నాయి. పెద్దాడినై పోతున్నా కదా!
2002లో ఆంధ్రజ్యోతి పంజాగుట్ట ఆఫీస్ ఎదురుగా ఒకావిడ బండిమీద టీ అమ్మేది. హబ్సిగూడా నుంచి వచ్చేది. రోజూ అక్కడే టీ తాగేవాళ్లం. కాకపోతే రోడ్డు దాటి వెళ్లాలి. ఒకసారి నా కొలీగ్ కిరణ్మయి ప్రమాదానికి కూడా గురైంది.
చూస్తూ వుండగానే అంకులై పోయాను. టీ మాత్రం మానలేదు. మణికొండ భీమాస్ రోజుకి ఒకటిరెండు సార్లు టీ తాగేవాన్ని. ఇప్పుడు అమెరికా వచ్చాను. టీ కావాలంటే ఇంట్లోనే తాగాలి. చెట్టు కింద గ్యాస్ స్టౌ పెట్టుకుని ఎవరూ వుండరు.
ఇక్కడ ఎవరూ హారన్ కొట్టరు, రోడ్లు అద్దంలా వుంటాయి. ప్లాస్టిక్, చిత్తు కాగితాలు కనపడవు. అంతా ok. కానీ మనుషులే కనపడరు. అందరూ కార్ల లోపల వుంటారు.
మా ఇంటి దగ్గర గురువారం జరిగే సంత, మర్రిచెట్టు కింద నిమ్మసోడా బండి, మొక్కజొన్న కండెలు కాల్చే అవ్వ, ట్రాఫిక్‌లో గుయ్యోమనే హారన్‌లు, ఉర్దూ తెలుగు పదాల కమ్మదనం, పారడైజ్ బిర్యానీ, కలకత్తా పాన్ …బరాబర్ చూసుకుందాం అనేవాళ్లు లేకపోతే ఎట్లా బతికేది సామీ.