iDreamPost
android-app
ios-app

వివాదంలో చిక్కుకున్న సోనూసూద్‌

వివాదంలో చిక్కుకున్న సోనూసూద్‌

సినిమాల్లో విలన్ గా ఉన్న సోనూసూద్‌ని 2020 సంవత్సరం నిజజీవితంలో హీరోగా మార్చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కాలంలో సోనూసూద్ వలస కూలీలకు చేసిన సాయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన సొంత ఖర్చుతో ప్రత్యేక బస్సులు,ట్రైన్స్,విమానాల ద్వారా వలస కూలీలను గమ్యానికి చేర్చిన సోనూసూద్ ఓ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు.

వివరాల్లోకి వెళితే సోనూసూద్ తన నివాస స్థలాన్ని హోటల్‌గా మార్చారన్న అభియోగాలను సోనూసూద్ ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ముంబై అధికారులు సోనూసూద్‌ గురించి పోలీసులకు పిర్యాదు చేసారు. సోనూసూద్‌కి ముంబైలోని జుహు ప్రాంతంలో శక్తి సాగర్‌ పేరుతో ఆరంతస్థుల భవనం ఉంది. ఈ భవనాన్ని హోటల్‌గా మార్చాలంటే అధికారుల అనుమతి అవసరం. కానీ సోనూసూద్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా తన భవనాన్ని హోటల్‌గా మార్చారని బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు నోటీసులు పంపగా సోనూసూద్ అధికారుల ఆదేశాలను ఏ మాత్రం లెక్కచేయలేదని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పోలీసులకు పిర్యాదు చేయడం గమనార్హం.

కాగా బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల ఆరోపణలను సోనూసూద్ ఖండించారు. తాను నిబంధనల మేరకు అన్ని అనుమతులు తీసుకున్నానని స్పష్టం చేశారు. మహారాష్ట్ర కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నుండి మాత్రం తన భవనానికి అనుమతి రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. కరోనా కారణంగా అనుమతి లభించడం ఆలస్యమైందని, మహారాష్ట్ర కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నుండి అనుమతి లభించకపోతే తిరిగి తన భవనాన్ని నివాస సముదాయంగా మారుస్తానని సోనూసూద్ తెలిపారు. ముంబై అధికారుల పిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ పూర్తిచేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.