iDreamPost
iDreamPost
వ్యవసాయ చట్టాలు, ఇతరత్రా కారణాలతో అకాలీదళ్ వంటి మిత్రపక్షాలను కోల్పోయిన బీజేపీ అసలే అంతంతమాత్రంగా ఉన్న దక్షిణాదిలోనూ కీలకమైన మిత్రపక్షాన్ని కోల్పోనుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళనాడులో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.ఎన్డీయే కూటమిలో బీజేపీ, అన్నాడీఎంకే భాగస్వాములుగా ఉన్నాయి. జాతీయస్థాయిలో కూటమికి బీజేపీ నాయకత్వం వహిస్తున్నా.. తమిళనాడులో మాత్రం అన్నాడీఎంకే నేతృత్వం వహిస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు కలిసి పోటీ చేసినప్పటికీ.. ఆ తర్వాత నుంచి విభేదాలు పెరిగాయి. ఇరుపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసెంబ్లీలోనూ ఎవరికి వారు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలతో చిచ్చు
కొన్నేళ్ల నుంచి ఎన్డీయే భాగస్వాములుగా ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ గత ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశాయి. సర్దుబాటు ప్రకారం 20 సీట్లకు పోటీ చేసిన బీజేపీ నాలుగు చోట్ల విజయం సాధించింది. అయితే ఆ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో సర్దుబాటు చేసుకోకుండా సొంతంగా అధిక స్థానాల్లో పోటీ చేసి చతికిలపడింది. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. మాటకు మాట అన్నట్లు విమర్శలు చేసుకుంటున్నారు. చివరికి అసెంబ్లీ సమావేశాల్లోనూ రెండు పార్టీల మధ్య సమన్వయం లేకుండా పోయింది. ఎవరికివారే అన్నట్లు ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా అంశంపై అన్నాడీఎంకే వాకౌట్ చేస్తే బీజేపీ సభ్యులు సభలో ఉంటున్నారు. బీజేపీ వాకౌట్ చేస్తే అన్నాడీఎంకే సభలో ఉంటోంది. దాంతో రెండు పార్టీల మధ్య సంబంధాలు చెడిపోయాయన్న ప్రచారం జోరందుకుంది.
‘మగతనం’ మంటలు
ఈ పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇరుపార్టీల మధ్య మరింత చిచ్చు రగిలించాయి. తంజావూరులో ఓ విద్యార్థిని మృతిపై బీజేపీ నిర్వహించిన ఆందోళనలో మాట్లాడిన నాగేంద్రన్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే మగతనం ఉన్న ఒక్క ఎమ్మెల్యే అయినా అన్నాడీఎంకేలో తనకు కనిపించలేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షంగా అన్నాడీఎంకే చేయలేని పనిని బీజేపీ చేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే నేతలు, శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ పార్టీ సాయంతో ఎమ్మెల్యేలు అయినవారు తిరిగి తమనే అంతంత మాటలు అనడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే నాగేంద్రన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆన్నామలై స్పందిస్తూ అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామికి ఫోన్ చేసి సారీ చెప్పినా ఆయన శాంతించలేదు. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేసి అక్కడే తేల్చుకోవాలని ఆయన సిద్ధం అవుతున్నట్లు అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు.