బీజేపీలో సస్ఫెన్షన్ల పర్వం సాగుతోంది. ఇప్పటికే ఆంధ్రజ్యోతిలో రాసిన ఆర్టికల్ కారణంగాఓ ఓవీ రమణను సస్ఫెండ్ చేశారు. తాజాగా అమరావతిలో బీజేపీ తీరుతో సిగ్గుపడుతున్నానంటూ చెప్పులతో చెంపలు వాయించుకున్న నాయకుడిని సాగనంపారు. సస్ఫెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. తన నిరసన తెలిపిన 24 గంటలు గడవకముందే ఆయనపై చర్యలు తీసుకోవడం విశేషంగా మారింది. ఏపీ బీజేపీలో దూకుడు కనిపిస్తోందనడానికి సాక్ష్యంగా మారింది.
కొన్నాళ్లుగా బీజేపీలో నేతలు భిన్న స్వరాలు వినిపిస్తూ ఉండేవారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనలకు భిన్నంగా కూడా పలువురు వ్యవహరించేవారు. జాతీయ స్థాయిలో పార్టీ తీరుని కూడా గుర్తించకుండా వ్యవహరించిన దాఖలాలున్నాయి. కానీ ప్రస్తుతం సోము వీర్రాజు సారధ్యంలో అలాంటి సీన్ ఉండదని స్పష్టం అవుతోంది. బీజేపీ వైఖరికి భిన్నంగా సాగే ప్రయత్నాలకు అడ్డుకట్ట తప్పదని ఆయన ప్రకటించారు. దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా అమరావతి రైతులకు బీజేపీ అన్యాయం చేసిందంటూ ఆపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిరసనకు దిగారు. మందడంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తన చెప్పులతో కొట్టుకున్నారు బీజేపీ చేసిన అన్యాయానికి తాను క్షమాపణలు చెబుతున్నాంటే వెలగపూడి గోపాలకృష్ణ చేసిన కార్యక్రమం కలకలం రేపింది. ఇటీవల హైకోర్టులో వేసిన అఫిడవిట్ కారణంగా కేంద్రం తప్పు చేసిందనే రీతిలో ఆయన మాట్లాడడంతో కమలనాథులు కస్సుమన్నారు. వెంటనే ఆయనపై చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా సస్ఫెండ్ చేస్తూ ఆదేశాలు విడుదలు చేశారు.
ఇక బీజేపీ నేతలంతా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందనే సంకేతాలు పంపిస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీలో ఉంటూ టీడీపీ అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరించే వారికి చెక్ పెట్టే యోచనలో సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ పరిణామాలు ఇటీవల బీజేపీలో చేరిన బాబు అనుచరులకు మింగుడుపడే అవకాశం లేదు. దాంతో రాబోయే రోజుల్లో వ్యవహరం మరింత ముదిరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.