iDreamPost
android-app
ios-app

జార్ఖండ్‌లోనూ ‘’హస్తవ్యస్తం’’ చేయాలని చూస్తున్నారా..?

జార్ఖండ్‌లోనూ ‘’హస్తవ్యస్తం’’ చేయాలని చూస్తున్నారా..?

కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో సక్సెస్ అయిన బిజెపి రాజస్థాన్‌లో సాధ్యం కాదనిపిస్తోంది. ఈ లోగా జార్ఖండ్ పై బిజెపి పడినట్లు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. జార్ఖండ్‌లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి యత్నిస్తుందని ఆరోపిస్తున్నారు.

రాజస్థాన్‌లో తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి ప్రయత్నిస్తోందంటూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్…తాజాగా జార్ఖండ్‌లో కూడా అదే పల్లవిని ఎత్తుకుంది. తమ ఎమ్మెల్యేలను ఆకర్షించి… ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోందంటూ పిసిసి అధ్యక్షుడు రామేశ్వర్ ఓరాన్ ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చడంలో బిజెపి ఎంత మాత్రమూ సక్సెస్ కాలేదని, ఎమ్మెల్యేలందరూ తమకు విధేయులుగానే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

‘‘తాము ప్రజాస్వామ్య విలువలను నమ్మమని బిజెపి మరోసారి రుజువు చేసుకుంటోంది. రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చాలని చూస్తోంది. మొదట కర్ణాటక, ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్… తాజాగా జార్ఖండ్ కూడా అదే లెక్కలో చేరేలా కనిపిస్తోంది. జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చాలని శతధా ప్రయత్నిస్తోంది. ఈ సమాచారం మాత్రం మా దగ్గరుంది’’ అని రామేశ్వర్ ప్రకటించారు.

కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై బిజెపి ఫైర్ అయ్యింది. పబ్లిసిటీ కోసం కాంగ్రెస్ చిల్లర రాజకీయాలను చేస్తోందని బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ మండిపడ్డారు. తమ సొంత ఎమ్మెల్యేలపైనే కాంగ్రెస్‌కు నమ్మకం లేదని ఆరోపించారు. కరోనాను ఎదుర్కోవడంలో సోరెన్ సర్కార్ విఫలమైందని, దాన్నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని దీపక్ మండిపడ్డారు.