iDreamPost
android-app
ios-app

ఫిరాయింపుల్లో ఒక్కో పార్టీది ఒక్కో పద్దతి

  • Published Sep 11, 2021 | 2:40 AM Updated Updated Sep 11, 2021 | 2:40 AM
ఫిరాయింపుల్లో ఒక్కో పార్టీది ఒక్కో పద్దతి

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. నిర్ధిష్ట కాలవ్యవధిలో జరిగే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకొని చట్టసభలకు పంపుతుంటారు. ప్రజల తరఫున వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. పార్టీలు సైతం అధికారం హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో సిద్ధాంతాలను గాలికి వదిలి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి.

ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా.. అందులోని లోపాలను ఉపయోగించుకొని అటు పార్టీలు.. ఇటు నేతలు యథేచ్ఛగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ విషయంలో అధికార పార్టీలు రెండాకులు ఎక్కువే తిన్నట్లు వ్యవహరిస్తున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్నే స్పష్టం చేసింది. గత ఏడేళ్లలో దేశంలో ఫిరాయింపులను ప్రోత్సహించడంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది.

Also Read:మాజీ సీఎం మరదలు – ఫుట్ పాత్ పై దయనీయ స్థితిలో

గోడ దూకిన 500 మంది ప్రజాప్రతినిధులు

ఏడీఆర్ సంస్థ 2014-21 మధ్య ఏడేళ్ల కాలంలో దేశంలో పార్టీ ఫిరాయింపులపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. నివేదికలోని వివరాల ప్రకారం ఏడేళ్లలో 500 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. వీరితోపాటు వివిధ ఎన్నికల్లో పోటీ చేసి న 1133 మంది అభ్యర్థులు కూడా పార్టీ కండువాలు మార్చేశారు. ఈ పార్టీ దూకుడు ఆటలో బీజేపీ బాగా లాభపడగా.. అత్యధికంగా నష్టపోయిన పార్టీ కాంగ్రెస్. ఈ ఏడేళ్లలో దేశవ్యాప్తంగా 173 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకున్నారు. వీరు కాకుండా వివిధ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన 253 మంది అభ్యర్థులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 222 మంది, బీఎస్పీ నుంచి 153 మంది అభ్యర్థులు, 20 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి ఫిరాయించారు. అదే సమయంలో బీజేపీ నుంచి కూడా 111 మంది అభ్యర్థులు, 33 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిరాయింపులు బాగానే జరిగాయి. అత్యధికంగా టీడీపీ నుంచి 32 మంది అభ్యర్థులు, 26 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి నలుగురు అభ్యర్థులు, మరో నలుగురు ప్రజా ప్రతినిధులు పార్టీలు మారారు. అత్యధికంగా టీఆరెస్ లోకి 30 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు, ఆంధ్రాలో వైఎస్సార్సీపీ లోకి 24 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు గత ఏడేళ్లలో ఇతర పార్టీల నుంచి చేరారు. పార్టీ మారాలనుకునే ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసి రావాలని వైఎస్సార్సీపీ షరతులు పెట్టడం ద్వారా వలసలను నియంత్రించినా.. మిగిలిన పార్టీలు అటువంటివేవీ లేకుండా గేట్లు తెరిచేయడం వల్ల పార్టీ ఫిరాయింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

Also Read:అదృష్టం అంటే జేడీఎస్‌దే.. అప్పుడు సీఎం సీటు.. ఇప్పుడు మేయర్‌ పీఠం..?