Idream media
Idream media
అశోక్ గెహ్లాత్, సచిన్ పైలెట్ ల మధ్య మళ్లీ స్నేహ హస్తం చిగురిస్తున్న వేళ.. రాజస్థాన్ రాజకీయాల్లో బీజేపీ కొత్త ట్విస్ట్ కు తెరలేపింది. బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఎప్పుడూ బల పరీక్ష.. బలపరీక్ష అనే మాటలు గెహ్లాత్ నోట నుంచి వచ్చేవి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ పూర్తిగా తన వ్యూహం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. తామే సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా ప్రకటన కలకలం రేపుతోంది. ప్రభుత్వ పక్షంలో చెప్పలేనన్ని విభేదాలున్నాయని, ఈ పరిస్థితుల్లో తామే సర్కారుపై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని సతీశ్ పూనియా సంచలన ప్రకటన చేశారు.
హడావిడిగా బీజేపీ నేతల సమావేశం
రాజస్థాన్ లో ఈ నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటి వరకు బలపరీక్షకు సిద్దమైన అశోక్ గెహ్లాత్ మారిన సమీకరణాలతో స్నేహ మంత్రం జపిస్తున్నారు. అశోక్, సచిన్ ఇద్దరూ ఐక్యతా రాగం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ కొత్త వ్యూహానికి పదును పెట్టింది. కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం ముగిసిన తర్వాత మొట్ట మొదటి సారి బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు హాజరయ్యారు. సచిన్ పైలట్ తిరిగి సొంత గూటికి చేరడంతో మాజీ సీఎం వసుంధర రాజే ఈ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే… వసుంధర లేకుండానే వ్యూహాన్ని సిద్ధం చేయడం అంత సులభం కాదని… బీజేపీ భావించినట్లు సమాచారం. శాసన సభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గెహ్లోత్ ప్రభుత్వం బల పరీక్షను హఠాత్తుగా ప్రకటిస్తే.. వ్యవహరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై బీజేపీ నేత గులాంచంద్ కటారియా మాట్లాడుతూ… ‘‘కాంగ్రెస్ బట్టను తిరిగి కుట్టడానికి ప్రయత్నిస్తోంది. కానీ అది చిరిగిన బట్ట. దానిని అతికించడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. ఇది తొందరగా కూలిపోయే సర్కార్.’’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వంపై తాము అవిశ్వాసానికి సిద్దమని పార్టీ అధ్యక్షుడి ప్రకటన వెనక ఆంతర్యం ఏంటనేది గెహ్లాత్ వర్గానికి బోధపడడం లేదు.