iDreamPost
android-app
ios-app

ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఎలా.. ? ఆ 24 మందిపై బీజేపీ అనుమానాలు

  • Published Jun 15, 2021 | 11:07 AM Updated Updated Jun 15, 2021 | 11:07 AM
ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఎలా.. ? ఆ 24 మందిపై బీజేపీ అనుమానాలు

అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బెంగాల్లో టీఎంసీ అధినేత, సీఎం మమతా బెనర్జీని ముప్పుతిప్పలు పెట్టి గుక్క తిప్పుకోనీయకుండా చేసిన బీజేపీ.. ఇప్పుడు తానే ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అధికారం అందకుండా పోయింది. పోనీ 77 మంది ఎమ్మెల్యేలతో బలం పెంచుకున్నామని చెప్పుకుందామన్నా.. వారిలో ఎప్పుడు.. ఎవరు.. అధికార టీఎంసీలోకి ఫిరాయిస్తారోనన్న టెన్షన్ పట్టుకుంది. తాజాగా గవర్నరుతో భేటీ వంటి ముఖ్యమైన కార్యక్రమానికి కూడా 24 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం బీజేపీకి మరింత బెంగ పట్టుకుంది.

గవర్నరుతో భేటీకి డుమ్మా

ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తృణమూల్ అధినేత్రి మమతా, బీజేపీ నాయకత్వం మధ్య ఇప్పటికీ వివాదాలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ముందు తృణమూల్ మంత్రులు , ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్న బీజేపీని ప్రస్తుతం మమత అదే రాజకీయంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

గతంలో బీజేపీలోకి దూకిన చాలామంది నేతలు మళ్లీ వెనక్కి వచ్చేందుకు తహతహలాడుతున్నారు. వారితో పాటు సుమారు 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సంసిద్ధత తెలుపుతూ తమతో టచ్ లో ఉన్నారని తృణమూల్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తర కృష్ణాపుర్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు మమత చెంతకు తిరిగి వచ్చేశారు.

మరోవైపు ఎమ్మెల్యేలందరు తమ వెంటే ఉన్నారని చాటేందుకు ప్రభుత్వంపై ఫిర్యాదు పేరుతో గవర్నరుతో భేటీ కార్యక్రమాన్ని బీజేపీ పక్ష నేత సువేందు అధికారి చేపట్టారు. ఎమ్మెల్యేలు అందరూ రావాలని సమాచారం పంపారు. కానీ 24 మంద గైర్హాజరయ్యారు. దాంతో వారిపై పార్టీవర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా టీఎంసీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమానికి డుమ్మా కొట్టారని అంటున్నారు. మరోవైపు మమతా వలసలకు ఇంకా గేట్లు తెరవకుండా బీజేపీని ఇంకొంతకాలం టెన్షన్లో ఉంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సువేందు నియామకంపై అసంతృప్తి

బీజేపీ నాయకత్వం తీరుపై పార్టీ ఎమ్మెల్యేల్లో పలువురు అసంతృప్తితో ఉన్నారు. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన సువేందు అధికారిని ప్రతిపక్ష నేతగా నియమించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి నుంచి ఉన్నవారిని విస్మరించారని అంటున్నారు. జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలోకి వెళ్లిపోవడానికి కూడా అదే కారణమని అంటున్నారు. కాగా గవర్నర్ జగదీప్ ధనకర్ ను ఎమ్మెల్యేలతో సహా కలిసిన సువేందు అధికారి.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని ఫిర్యాదు చేశారు. అరాచకాలు పెరుగుతున్నాయని.. పరిస్థితిని అదువులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నరును కోరారు.

Also Read : మోదీ ఇలాకాలో పాగా వేస్తామంటున్న ఆప్