iDreamPost
android-app
ios-app

కమల వికాసమే, దేశమంతా హవా చాటిన బీజేపీ

  • Published Nov 10, 2020 | 6:17 AM Updated Updated Nov 10, 2020 | 6:17 AM
కమల వికాసమే, దేశమంతా హవా చాటిన బీజేపీ

బీజేపీ మరోసారి విజయకేతనం ఎగురవేస్తోంది. దేశమంతా తన హవా చాటుతోంది. కర్ణాటక నుంచి మణిపూర్ వరకూ అన్ని చోట్లా ఆపార్టీ విజయం దిశగా సాగుతోంది. 12 రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లోనూ బీజేపీదే పై చేయి. బీహార్ సాదారణ ఎన్నికల్లో కూడా ఆపార్టీ అనూహ్యంగా సత్తాచాటింది. ఎన్డీయే కూటమిలోని జేడీయూ ని మించి అధిక సీట్లు సాధించిన పార్టీగా నిలుస్తోంది. తుది ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం అంచనాల ప్రకారం కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ విజయాలు దోహదం చేస్తాయని అంచనాలు వేస్తున్నారు. అదే సమయంలో ఆర్జేడీ భారీ విజయం సాధించినా, కూటమిలో కాంగ్రెస్ పుంజుకోకపోవడంతో మహా కూటమి ఆశలు ఫలించడం లేదని ప్రస్తుతం ట్రెండ్స్ ని బట్టి అర్థమవుతోంది.

బీహార్ లో 243 స్థానాలకు గానూ ఈసారి మహాకూటమికే సానుకూలత ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ లో భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ప్రకారం 11.20గం.ల సమయానికి బీజేపీ 64, జేడీయూ 49, వికాస్ ఇన్సాన్ పార్టీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. తద్వారా ఎన్డీయే కూటమికి 118 స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తోంది. అదే సమయంలో మహా కూటమిలోని ఆర్జేడీ 62 సీట్లలో కాంగ్రెస్ 21, సీపీఐ ఎంల్ లిబరేషన్ 13, సీపీఎం 3, సీపీఐ 2 చోట ఆధిక్యంలో కనిపిస్తున్నాయి. దాంతో ఈ కూటమికి చెందిన అభ్యర్థులు 99 చోట్ల ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. లోక్ జనశక్తి పార్టీ 5, ఇండిపెండెంట్లు 4, ఎంఐఎం 1, బీఎస్పీ 1 చోట ఆధిక్యంలో సాగుతున్నాయి. దాంతో ఈ ఫలితాలను బట్టి బీహార్ లో కమల వికాసం ఖాయంగా కనిపిస్తోంది. జేడీయూని వెనక్కి నెట్టి ఈసారి బీజేపీ సారద్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

అదే సమయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ దూసుకుపోతోంది. మధ్యప్రదేశ్‌ లో 28 స్థానాలకు గానూ 18 చోట్ల బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 8 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. కర్ణాటకలో రెండు స్థానాల్లోనూ బీజేపీకే ఆధిక్యం కనిపిస్తోంది. గుజరాత్ లో కూడా 8 స్థానాలకు గానూ 7 చోట్ల బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ లో 7 చోట్లకు గానూ 5 స్థానాల్లో బీజేపీ హవా కనిపిస్తోంది. హర్యానాలో మాత్రం కాంగ్రెస్, చత్తీస్ ఘడ్ లో కూడా కాంగ్రెస్ పట్టు కనిపిస్తోది. ఒడిశాలో జేడీయూ రెండు సీట్లను కైవసం చేసుకునే దిశలో ఉంది.

దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం ఆసక్తికరంగా కనిపిస్తోంది. కారు జోరుకి బ్రేకులు పడినట్టుగా అంతా భావిస్తున్నారు. అయితే దుబ్బాక,తొగట మండలాలో బీజేపీ కి ఆధిక్యం మొదటి నుంచి అంచనా వేస్తున్నారు. మిగిలిన చేగుంట,మిరుదొడ్డి ,నర్సింగ్ ,రాయపూర్ మండలాల్లో మాత్రం టీఆర్ఎస్ పట్టు సాధిస్తుందనే అంచనాలున్నాయి. దాంతో రాబోయే కొన్ని రెండ్ల ఫలితాల ఆధారంగా తుది తీర్పు ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఆరో రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. దాంతో బీజేపీ మెజార్టీ తగ్గుముఖం పట్టడం కీలకంగా మారింది.