iDreamPost
android-app
ios-app

ఏపీలో లక్ష్యం నిర్థేశించుకున్న కమలదళం

ఏపీలో లక్ష్యం నిర్థేశించుకున్న కమలదళం

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన సోము వీర్రాజు ప్రమాణస్వీకారం సాక్షిగా ఆ పార్టీ లక్ష్యం నిర్థేశించుకుంది. విజయవాడలో కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోము వీర్రాజులు తమ లక్ష్యం ఏమిటో కార్యకర్తలకు తెలియజేశారు. వాటిని అందుకునేందుకు ఏమి చేయాలి..? ఎలా పని చేయాలో సావధానంగా చెప్పారు.

2024లో రాష్ట్రంలో బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తామని సోము వీర్రాజు వెల్లడించగా.. ఈ లోపు మరో లక్ష్యం చేరుకోవాలని రాం మాధవ్‌ నిర్థేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం స్థానం ఖాళీగా ఉందని, ముందు దానిని భర్తీ చేయాలని రాం మాధవ్‌ పేర్కొన్నారు. నిర్మాణాత్మకమైన ప్రతిక్షంగా ప్రజల తరఫున పని చేయాలన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే.. వాటిని మరింతగా ఎలా చేయాలో సద్విమర్శలు చేయాలని సూచించారు.

ఇంతకాలం జూనియర్‌ పార్టనర్‌గా ఉన్నామని చెప్పిన రాం మాధవ్, ఇతర పార్టీలపై భుజాలు వేసి వెళదామనే ఆలోచన నుంచి బయటకు వస్తేనే అనుకున్న లక్ష్యం చేరుకోగలమన్నారు. మోదీ భుజాలపై తుపాకిపెట్టి యుద్ధం చే స్తామంటే లక్ష్యం చేరుకోలేమని, రాష్ట్ర యూనిట్‌ అగ్రిసివ్‌గా ప్రజల కోసం పని చేయాలని సూచించారు. ఏపీలో అధికారంలోకి రావడం అంత సులువుకాదని, అయితే గట్టి ప్రయత్నం చేస్తే సాధించగలమన్నారు.