iDreamPost
android-app
ios-app

Somu Veerraju, BJP, Vizag Steel Plant – విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుతున్నది బీజేపీయేనట!

  • Published Dec 16, 2021 | 12:16 PM Updated Updated Mar 11, 2022 | 10:31 PM
Somu Veerraju, BJP, Vizag Steel Plant – విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుతున్నది బీజేపీయేనట!

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఒకపక్క చురుగ్గా అడుగులు వేస్తుండగా, దానిని కాపాడుతున్నది భారతీయ జనతా పార్టీయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంటలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రశ్నించగా స్టీల్‌ప్లాంటును బీజేపీ కాపాడుతోందన్నారు. నష్టాలు వచ్చిన ప్రతి సంవత్సరం స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.మూడు వేల కోట్ల చొప్పున ఇచ్చిందన్నారు. చంద్రబాబునాయుడు షుగర్‌ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్‌ మిల్లులను అమ్మేస్తే ఎవరూ అడగలేదు కానీ, అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్న తమ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్నారు.

saaఓట్లు వేసి గెలిపించిన వారిని అడగకుండా పనిచేసే ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారన్నారు. నష్టాలు వచ్చిన సంవత్సరాల్లో రూ.మూడు వేల కోట్ల చొప్పున ఇవ్వడం కాకుండా స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి గదా. ఎందరో త్యాగాలు, బలిదానాల ఫలితంగా ఆంధ్రుల హక్కుగా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా కాపాడాల్సిన బాధ్యత నుంచి తప్పుకొనేలా సోము వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్‌ మైన్స్‌ కేటాయించండి మొర్రో అని ఎన్నేళ్ల నుంచో మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా నష్టం వచ్చినప్పుడు సాయం చేస్తున్నాం, ఇక చేయలేం, ప్రైవేటుపరం చేస్తాం అనడం ఏం సబబు?

చంద్రబాబు దారిలో నడుస్తారా?

చంద్రబాబు షుగర్‌ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్‌ మిల్లులను అమ్మేస్తే ఎవరూ అడగలేదు కానీ, అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్న తమ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ప్రజలను ఎద్దేవా చేయడం తగునా అన్న ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు? ప్రజాభిప్రాయానికి భిన్నంగా, వారి ఆకాంక్షలకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించారు కనుకనే జనం తెలుగుదేశం పార్టీని ఘోరంగా ఓడించారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఆయన బాటలోనే నడుస్తుందీ అంటే మీకు కూడా జనం అదే రకంగా గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తేనే ఏ రాజకీయ పార్టీకైనా మనుగడ ఉంటుంది.  మేము నిర్ణయం తీసేసుకున్నాం. ఎవరికెంత నష్టం వచ్చినా మాకు సంబంధం లేదు. ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం అంటే బీజేపీకే నష్టం అన్న సంగతి ఆ పార్టీ నాయకులు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ప్రాంతీయ భేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మూకుమ్ముడి ఆకాంక్ష స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ అన్న విషయం గమనించి, కేంద్రానికి నచ్చజెబితే రాష్ట్రంలో బలపడాలనుకుంటున్న బీజేపీకి లబ్ధి చేకూరుతుంది కానీ ఇలా వితండవాదం చేస్తే ప్రయోజనం ఉండదని ఉక్కు కార్మికులు అంటున్నారు.

ఓట్లు వేయకపోతే అడిగే హక్కు ఉండదా?

ఓట్లు వేసి గెలిపించిన వారిని అడగకుండా పనిచేసే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏమిటని అంటున్న సోము వ్యాఖ్యలను పలువురు తప్పు పడుతున్నారు. బీజేపీకి ఓట్లు వేయనంత మాత్రాన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఐదేళ్లూ కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విషయంలోనూ రాష్ట్రానికి మేలు చేయమని అడిగే హక్కును కోల్పోతారా? ఇదేం లాజిక్‌? ఎన్నికల్లో తమ పార్టీని జనం ఎందుకు తిరస్కరించారో తెలుసుకుని, జనామోదం పొందేలా పనిచేసి వచ్చే సారైనా గెలిచే ప్రయత్నం చేయాలి కాని ఇలా ఓటు వేయకపోతే మీకు మేలు చేయం అంటే మళ్లీసారి మాత్రం బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తారా? సోము ఉద్దేశం ప్రకారం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వాన్ని జనం నిలదీయడానికి అదే రాష్ట్ర పరిధిలోని అంశం కాదు కదా? అయినా జగన్‌ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను ఏవిధంగా పరిరక్షించవచ్చో వివరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. పార్లమెంట్‌లో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు పలు దఫాలు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. అంతకుమించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక సీనియర్‌ రాజకీయ నాయకుడిగా ఈ విషయం సోముకు తెలియదా? కేంద్రంలోని తమ పార్టీ ప్రభుత్వానికి నచ్చజెప్పి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడం పోయి ఇలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై, ఆ పార్టీకి ఓట్లేసిన ప్రజలపై చౌకబారు విమర్శలు చేయడం అంతిమంగా బీజేపీకి నష్టం చేస్తుందన్న సంగతి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన సోము తెలుసుకోవడం ఆయనకే మంచిది అన్న సూచనలు వినిపిస్తున్నాయి.