iDreamPost
android-app
ios-app

ఉద్రిక్తంగా మారిన ‘ఛలో గుడివాడ’ : సోము వీర్రాజు అరెస్ట్!

ఉద్రిక్తంగా మారిన ‘ఛలో గుడివాడ’ : సోము వీర్రాజు అరెస్ట్!

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ క్యాసినో వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి పెరుగుతోంది. మంత్రి కొడాలి నానీకి చెందిన కే కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో ఆడారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంమీద చర్చ జరుగుతోంది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అంటూ కొందరు పార్టీ నేతలను అక్కడికి పంపారు. అయితే వైసీపీ నేతలు టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకున్నారు.అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండడంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కు పంపారు. ఈరోజు బీజేపీ నేతలు గుడివాడ వెళ్లి క్యాసినో ఆరోపణలపై నిజాలను తెలుసుకుంటామని ప్రకటించారు. గుడివాడలో సంక్రాంతి ముగింపు సంబరాలను తాము నిర్వహిస్తామని ఏపీ బీజేపీ అధ్యకుడు సోము వీర్రాజు ప్రకటించారు.

అన్నట్టుగానే విజయవాడ నుంచి బీజేపీ బృందం గుడివాడకు బయల్దేరింది. ఈ బృందంలో సోమువీర్రాజు, సీఎం రమేష్‌, మాధవ్, నారాయణరెడ్డి సహా ఇతర నేతలు ఉన్నారు. అయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు.. ఇతర సీనియర్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం దగ్గరలోని నందమూరు అడ్డరోడ్డు దగ్గర.. నేతలను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే.. తాము సంక్రాంతి సంబరాలు ప్రజలకు తెలియజేసేందుకే గుడివాడ వెళ్తున్నామని.. మరో కారణం లేదని సోము వీర్రాజుతో పాటు.. బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గుడివాడలో 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా అనుమతించేది లేదంటూ పోలీసులు తేల్చి చెప్పారు.

అయితే తమ వాహనాలు లేకున్నా నడిచే వెళ్తామని సోము వీర్రాజు సహా మిగతా నేతలు కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆగకపోవడంటో కలువపాముల ప్రాంతంలో సోము వీర్రాజుతో పాటు.. ఇతర బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతం నుంచి తరలించారు. అయితే పోలీసుల తీరు సరిగాలేదని బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఆందోళనలు, ధర్నాలు చేయడానికి మేము వెళ్లడంలేదని వేడుకలు చేసేందుకు వెళ్తున్నామని.. అయినా అరెస్ట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే అరెస్ట్ చేసిన అందరినీ ఎక్కడికి తరలించారు అనేది తెలియాల్సి ఉంది.