iDreamPost
iDreamPost
ఏపీలో బీజేపీ ప్రస్థానం ఆశ్చర్యంగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో అంతా బాగున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అనూహ్యంగా ఎన్నికల నాటికి పూర్తి పేలవంగా మారిపోతుంది. ప్రతీసారి ఆపార్టీది ఇదే తంతు. కేవలం 1998,99 ఎన్నికల్లోనే కొంత ప్రభావం చూపగలిగింది. అప్పట్లో వాజ్ పాయ్ హవా సాగిన సమయంలో గోదావరి జిల్లాల్లో ఎంపీ స్థానాలను గెలుచుకుని కమలం వికసించినట్టే కనిపించింది. ఇతర ప్రాంతాల్లో కూడా ఆపార్టీ ప్రభావం కనిపించింది. రాయలసీమలోనూ బీజేపీ బలపడుతుందనే అభిప్రాయం కలిగించింది. కానీ అంతలోనే పూర్తిగా కుదేలయ్యింది.
ఇక మోడీ హవా దేశమంతా కనిపించినా తెలుగు నేల మీద మాత్రం పెద్దగా కనిపించడం లేదనడానికి 2019 ఎన్నికలు ఓ ఉదాహరణ. ఏపీలో కనీసం 1 శాతం ఓట్లు తెచ్చుకోవడమే ఆపార్టీకి గగనంగా మారింది. డిపాజిట్లు దక్కించుకోవడం కూడా కష్టంగా మారింది. అలాంటి పార్టీ ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ స్థాయి రాజకీయాల కారణంగా ఢీ లా పడిపోకుండా నిలబడింది. ఇక టీడీపీ కి కష్టకాలం దాపురించడంతో కమలదళంలో ఉత్సాహం కొనితెచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇక తామే ప్రతిపక్షం అని ఆపార్టీకి చెందిన కీలక నేతలు కూడా ప్రకటించారు. 2024లో అధికారంలోకి వచ్చేస్తామంటూ సోము వీర్రాజు కూడా ప్రకటించారు. దానికి అనుగుణంగా జనసేన కూడా జై బీజేపీ అనడంతో అది కూడా కలిసి వస్తుందని ఆశిస్తోంది.
బీజేపీ-జనసేన కూటమితో ఏపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని కాషాయ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ సీన్ భిన్నంగా ఉంది. బీజేపీలో ఉత్సాహం అలా ఉంచితే పవన్ కారణంగా పార్టీ పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదని ఇప్పుడు మధనపడుతున్నారు. పైగా జనసేన కార్యకర్తలే జావగారిపోయినట్టుగా కనిపిస్తున్న తరుణంలో రాజకీయంగా పవన్ తో స్నేహం పనికొస్తుందా అనే ప్రశ్న వారిలో ఉదయిస్తోంది. ఇక అన్నింటికీ మించి టీడీపీ నుంచి పెద్ద స్థాయిలో వలసలు ఉంటాయని బీజేపీ భావించింది. దానికి తగ్గట్టుగానే పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకులతో మంతనాలు జరిపారు. టీడీపీకి చెందిన గంటా, అనగాని సత్యప్రసాద్ వంటి ఎమ్మెల్యేలు బీజేపీ ఆఫీసులోనే ఆపార్టీ నేతలతో బేటీ కావడంతో ఇంకేముందనే ప్రచారం సాగింది. దాదాపుగా డజను మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమ దారికి వస్తున్నట్టు బీజేపీ చెప్పుకుంది.
తీరా రెండేళ్ల తర్వాత చూస్తుంటే ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా బీజేపీ వెంట నడిచిన దాఖలాలు లేవు. కేవలం టీడీపీ నుంచి నలుగురు ఎంపీలు మాత్రమే కండువాలు కప్పుకున్నారు. వారు కూడా బాబు ఆదేశాల మేరకు, ఆయన కనుసన్నల్లోనే పనిచేసేందుకు కమలధారణ చేసినట్టు ఆ తర్వాతి పరిణామాలు చెబుతున్నాయి. వారితో పాటుగా ఆదినారాయణ రెడ్డి వంటి మాజీ మంత్రి, మరో ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం కమలం గూటిలో చేరారు. కానీ ఇలాంటి నేతలంతా మళ్లీ ఆపార్టీలో ఎన్నాళ్లు కొనసాగుతారనేది సందేహమే. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో బీజేపీ బలపడుతుందా అంటే సందేహంగానే చెప్పవచ్చు. రెండడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కి అనే చందంగా మారింది. ఓవైపు చాలా పుంజుకున్నామని బీజేపీ నేతలు కొందరు భావిస్తుండగా, క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. మరోవైపు దిగజారుతున్న మోడీ ప్రతిష్ట కారణంగా కమలానికి కొత్త కష్టాలు దేశమంతా మొదలయ్యేలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రతికూల వాతావరణం పెరిగితే ఏపీ బీజేపీకి మరిన్ని సమస్యలు తప్పవు.
సానుకూల సమయంలోనే సత్తా చాటలేని బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం ఇక దేశమంతా వ్యతిరేక పవనాలు మొదలయితే ఎదుర్కోవడం కష్టం అవుతుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీలోకి పలువురు నేతలను ఆహ్వానించి, బలాన్ని చాటుకోవాలని చూస్తోంది. కానీ అనేక మంది సీనియర్లు. మాజీలు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. వైఎస్సార్సీపీలో ఖాళీ కనిపించకపోయినా మళ్లీ ఆపార్టీ వైపు మొగ్గు చూపుతున్నారే తప్ప బీజేపీలో కొత్త నేతలు ఎందుకు కనిపించడం లేదన్నదే కమలం పార్టీలో కలవరం కలిగిస్తోంది. ఇలాంటి స్తితిలో పార్టీ బలపడే మార్గాలు ఏమిటా అన్నది వారికి బోధపడుతున్నట్టు కనిపించడం లేదు. కేవలం టీడీపీ బలహీనతలనే ఆధారంగా చేసుకుని ఏపీలో బలం సాధించాలనే ఆశతో ఉన్న బీజేపీకి అది సాధ్యమా కాదా అన్నది ప్రస్తుతానికి అంతుబట్టనట్టే ఉంది.