iDreamPost
android-app
ios-app

Bjp – మళ్లీ తెరపైకి మధుర శ్రీకృష్ణ జన్మస్థల వివాదం

  • Published Dec 05, 2021 | 7:20 AM Updated Updated Mar 11, 2022 | 10:32 PM
Bjp – మళ్లీ తెరపైకి మధుర శ్రీకృష్ణ జన్మస్థల వివాదం

‘అయోధ్య, కాశీలలో గొప్ప ఆలయాల నిర్మాణం జరుగుతోంది..ఇప్పుడు మధుర కోసం సన్నాహాలు’ ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ చంద్ర మౌర్య ఇటీవల చేసిన ట్వీట్ ఇది. జై శ్రీరామ్, జై శివ శంభో, జై శ్రీ రాధేకృష్ణ అన్న హ్యాష్ ట్యాగ్ లు కూడా జోడించారు. అదే సమయంలో మధురలోని అసలైన శ్రీకృష్ణ జన్మస్థలంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని అఖిల భారత హిందూ మహాసభ, శ్రీకృష్ణ జన్మస్థలంలోని మసీదును తొలగించాలన్న డిమాండుతో పాదయాత్ర చేస్తామని నారాయణి సేన ప్రకటించడం విశేషం. ఈ రెండూ కూడా బాబ్రీ మసీదు ధ్వంసం జరిగిన రోజైన డిసెంబర్ ఆరో తేదీనే తలపెట్టడంతో పరిష్కారం అయిపోయిందనుకున్న మధుర శ్రీకృష్ణ జన్మస్థల వివాదం మళ్లీ తెరపైకి వచ్చి ఉద్రిక్తతలు రేవుతోంది. దీంతో మధురలో సెక్షన్ 144 విధించారు.

1968లో పరిష్కారం

మధురలోని కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలోని 13.37 ఎకరాల్లో శ్రీకృష్ణుడి జన్మస్థలం ఉందన్న వాదన మొదటి నుంచీ ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1669-70 సంవత్సరాల్లో ఈ ప్రాంగణంలోని కొంత భాగాన్ని ధ్వంసం చేసి షాహీ ఈద్గా మసీదు నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిన ఈ వివాదంపై కోర్టుల్లోనూ విచారణలు జరిగాయి.అయితే 1968 ఆక్టోబరులో శ్రీకృష్ణ జన్మస్థాన సేవా సంఘం, షాహీ ఈద్గా మసీదు కమిటీ మధ్య రాజీ కుదిరింది. దాంతో కేసులు కూడా పరిష్కారమయ్యాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఆ వివాదం రాజుకుంటోంది. 1968 నాటి రాజీ ఒప్పందాలు, కోర్టు తీర్పులను రద్దు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. స్థానిక కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు ఇటీవల పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

రాజకీయ లబ్దికి బీజేపీ ఆరాటం

ఇదే సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైన డిసెంబర్ 6వ తేదీన అసలైన శ్రీకృష్ణ జన్మస్థలంలో విగ్రహ ప్రతిష్ట చేస్తామని అఖిల భారత హిందూ మహాసభ ప్రకటించింది. కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న షాహీ ఈద్గా మసీదులోనే శ్రీకృష్ణుడి అసలు జన్మస్థలం ఉందన్నది వారి వాదన. అలాగే మసీదును తొలగించి ఆ భూమిని హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ విశ్రామఘాట్ నుంచి శ్రీకృష్ణ జన్మస్థాన్ వరకు పాదయాత్ర చేస్తామని నారాయణి సేన ప్రకటించింది. దీంతో మధురలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూ సంఘాలకు చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి.. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ నేత, యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ చంద్ర మౌర్య చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ప్రజల్లో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం కోసం అన్ని మార్గాలు వెతుకుతున్న బీజేపీ చివరికి మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తెగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.