iDreamPost
iDreamPost
తిరుపతి బరిలో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి నియోజకవర్గ పర్యటనలు ప్రారంభించారు. నేరుగా ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గ ఉప ఎన్నికలపై సమీక్ష జరిపారు. పలువురు మంత్రులు, పార్టీ నేతలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దేశం దృష్టిని ఆకర్షించే రీతిలో మెజార్టీ సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇక టీడీపీ అభ్యర్థి, సీనియర్ నేత ప్రచారం ప్రారంభించారు. ఎట్టకేలకు ఆమె రంగంలోకి రావడంతో టీడీపీ ఊపిరిపీల్చుకుంది. చంద్రబాబు కూడా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ టీడీపీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నాయి.
అందరికన్నా ముందే తిరుపతిలో మకాం ఏర్పాటు చేసుకున్న బీజేపీ నేతలు మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతిలో తాత్కాలిక నివాసం కూడా ఏర్పాటు చేసుకుని నాలుగు నెలలు గడిచినా నేటికీ బరిలో దిగేదెవరన్నది తేలలేదు. తొలుత జనసేన-బీజేపీ మధ్య దోబూచులాట జరిగింది. చివరకు ఇటీవల పవన్ తో సమావేశానంతరం బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ అభ్యర్థి ఎవరన్నది మాత్రం స్పష్టత రాలేదు.
ఇప్పటికే పలువురు ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గడిచిన ఆరు నెలలుగా తిరుపతి చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్న దాసరి శ్రీనివాస్ అనే రిటైర్డ్ ఐఏఎస్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన దాదాపుగా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు. వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటనలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయనకు బీజేపీ అధిష్టానం ఆశీస్సులున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.
అయితే ఆయనకు పోటీగా కర్ణాటక మాజీ సీఎస్ రత్న ప్రభ, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సహా అనేక మంది ఆశావాహులు టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఎవరికి వారే తమకున్న పరిచయాలతో బీజేపీ అధిష్టానం వద్ద రాయబారాలు నడుపుతున్నారు. హస్తినలో కమలనాథులంతా బెంగాల్ పై దృష్టి సారించడంతో తిరుపతి ఉప ఎన్నికలను పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదనే అభిప్రాయం ఉంది. దానికి తోడుగా తాజాగా తెలంగాణా మండలి ఎన్నికల్లో కమలం ఖంగుతినాల్సి వచ్చింది. అక్కడి శాసనమండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది. ఉన్న ఒక్కగానొక్క సిట్టింగ్ సీటులో కూడా ఓటమి పాలయ్యింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఉప ఎన్నికల మీద అంతగా శ్రద్ధ పెట్టే అవకాశం లేదని చెబుతున్నారు.
మరోవైపు స్థానిక ఎన్నికల్లో అధికార పక్షం దూకుడు కూడా బీజేపీ నేతలను బెంబేలెత్తిస్తోంది. విశాఖ ఉక్కు అంశం కూడా మరోసారి ప్రత్యేక హోదా మాదిరిగా బీజేపీని కలవరపరుస్తోంది. ఈ సమయంలో ఈనెల 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుండగా అభ్యర్థిత్వం విషయంలో స్పష్టత రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అయితే బీజేపీలోని ఏపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాల మూలంగానే అభ్యర్థిని ఖరారు చేయడంలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా నెల రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో బీజేపీ అభ్యర్థి విషయంలో ఇంకా మల్లగుల్లాలు సాగడం విశేషంగా మారుతోంది.