iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి పరిస్థితులు అనుకూలించిన దాఖలాలు లేవు. అయితే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందనే విశ్వాసం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చి చేరిన నేతలతో ఇంకా కొందరు ఎమ్మెల్యేలు కూడా చేరతారని గతంలో ఆశించింది. కానీ ప్రస్తుతం అలాంటి ఆనవాళ్లు లేవు. పైగా బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపిన నేతలు కూడా ఇప్పుడు మొఖం చాటేశారు. అనగాని సత్యప్రసాద్, గంటా శ్రీనివాసరావు వంటి వారు బీజేపీ అధిష్టానంలోని పెద్దలతో ఏడాది క్రితమే మంతనాలు జరిపినా, ముందడుగు వేయలేదు. అప్పట్లో వారంతా తమ పార్టీలో చేరుతున్నట్టు బీజేపీ రాష్ట్ర నేతలు చేసిన ప్రచారం ఫలించలేదు.
అదే సమయంలో కీలకాంశాల్లో బీజేపీ వైఖరి ప్రజలతో పాటుగా ఆపార్టీ శ్రేణులను కూడా గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఇప్పటికే రాజధాని విషయంలో బీజేపీలో భిన్నస్వరాలు వినిపించాయి. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదని ఇప్పటికే కేంద్రం తేల్చేసింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ వంటి వారు మూడు రాజధానులకు దాదాపుగా సానుకూలత వ్యక్తం చేశారు. అదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ మాత్రం అమరావతి కోసం ఆందోళన చేయడమే కాకుండా, ఏకంగా రాజధాని బిల్లులు ఆమోదించవద్దంటూ గవర్నర్ కి కూడా లేఖ రాయడం విశేషం. ఓవైపు కర్నూలులో హైకోర్ట్ పెట్టాలని తీర్మానం చేసిన బీజేపీ, ఇప్పుడు ఆ నగరాన్ని న్యాయరాజధాని చేయడానికి అడ్డుపుల్ల వేయడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దానికి బీజేపీ నేతలనుంచి సూటిగా సమాధానం కూడా కనిపించడం లేదు.
నిమ్మగడ్డ విషయం కూడా కమలనాధులకు మింగుడుపడడం లేదు. ఎస్ఈసీ విషయంలో రాష్ట్ర క్యాబినెట్ సిఫార్సులతో నియామకాలు చెల్లవని కనగరాజు విషయంలో హైకోర్ట్ చేసిన వ్యాఖ్యల ప్రకారం నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదనే సంకేతం ఉంది. అలాంటి సమయంలో ఆయన్ని పునర్నియామకం చేయాలనే విషయంలో బీజేపీ మాట్లాడేందుకు అవకాశం కనిపించడం లేదు. చివరకు గవర్నర్ కూడా బంతిని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టేసి కథను మళ్లీ మొదటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డతో సుజనా, కామినేని వంటి వారు మంతనాలు చేయడం, కేసులో పిటీషనర్ గా కూడా కామినేని ఉండడంతో నియామకం విషయంలో ఏమాట్లాడలనేది బీజేపీ నేతలకు బోధపడడం లేదు. హైకోర్ట్, గవర్నర్ నియామకం ప్రకారం మాట్లాడాలా..లేక కామినేని, సుజనా వంటి వారి దారిలో నడవాలా అనేది అంతుబట్టని విషయంగా మారింది
దాంతో చివరకు ఈరెండు విషయాల్లో ఎక్కడా చర్చలు చేయకూడదని బీజేపీ నేతలకు ఆదేశాలు అందాయి. ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుతూ బీజేపీకి నిర్ధిష్ట విధానం లేదనే రీతిలో మాట్లాడుతున్న సందర్భంలో ఈ ఆదేశాలు వచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీ నేతల్లో ఉన్న గందరగోళం కారణంగా ప్రజల్లో బీజేపీ పరువు పోతుందనే అంచనాతో టీవీ చర్చల్లో కూడా ఈ అంశాలను ప్రస్తావించకూడదని ఆదేశాలు ఇచ్చినట్టు కనిపిస్తోంది.