iDreamPost
android-app
ios-app

వివాదాస్పదంగా మారిన ఆర్ఆర్ఆర్ టీజర్ – రాజమౌళికి బీజేపీ ఎంపీ ఘాటు వార్నింగ్

వివాదాస్పదంగా మారిన ఆర్ఆర్ఆర్ టీజర్ – రాజమౌళికి బీజేపీ ఎంపీ ఘాటు వార్నింగ్

దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)..ఈ చిత్రంలో ప్రముఖ నటులు రామ్ చరణ్ తేజ్ స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ ఆదివాసుల హక్కుల కోసం నైజాం ప్రభువుతో పోరాటం చేసిన గోండు యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. కాగా ఇటీవల రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించిన కొమరం భీం టీజర్ ను ఆర్ఆర్ఆర్ టీం విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ భీమ్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్ హావభావాలను చూస్తే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ గా భీం పాత్రను దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దిన్నట్లు అర్థం చేసుకోవచ్చు. కానీ టీజర్ చివరలో వచ్చే ఎన్టీఆర్ లుక్ వివాదాస్పదంగా మారింది. టోపీ ధరించి ముస్లిం వేషధారణలో భీం పాత్ర కనిపించడంతో కొమరం భీం అభిమానులు ఆందోళనకు దిగుతున్నారు. కొమరం భీం పాత్రను వక్రీకరించి చిత్రీకరిస్తే ఊరుకునేది లేదని ఆదివాసీలు రాజమౌళిని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కొందరు ఆదివాసీ యువకులు కొమరం భీం విగ్రహానికి క్షీరాభిషేకం చేసి దర్శకుడు రాజమౌళిని హెచ్చరించిన విషయం తెలిసిందే.

థియేటర్లు తగలబెడతాం – ఎంపీ సోయం బాపురావు

తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళికి వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.ఆదిలాబాద్ జిల్లా చిత్తబుట్ట గ్రామంలో కొమరం భీం 80 వ వర్థంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ మూవీలో భీం పాత్ర ధరించిన టోపీని తొలగించాలని రాజమౌళికి సూచించారు. కలెక్షన్ల కోసం చరిత్రను వక్రీకరిస్తే సహించబోమని హెచ్చరించారు. కొమరం భీమ్ ఆదివాసీల హక్కుల కోసం నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశాడని, ఆయనను చంపిన వాళ్ళ టోపిని భీంకు పెట్టడం అంటే ఆదివాసుల మనోభావాలను దెబ్బ తీసినట్లే అని ఆయన పేర్కొన్నారు.

చరిత్ర తెలుసుకుని సినిమా తీయాలని ఎంపీ బాపురావు రాజమౌళికి సూచించారు. ఒకవేళ భీం చరిత్ర వక్రీకరించి సినిమా తీసి విడుదల చేస్తే థియేటర్లను తగలబెడతామని రాజమౌళిని ఘాటుగా హెచ్చరించారు. కొమరం భీం ఏ ఉద్దేశ్యంతో పోరాటం చేసాడో,ఎవరికోసం పోరాటం చేసాడో ఉన్నది ఉన్నట్లుగా చిత్రీకరించాలని ఎంపీ సూచించారు. లుక్ మార్చకుంటే మర్యాద దక్కదని ఎంపీ వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సినిమాకు వ్యతిరేకంగా నిరసన చేపడతాం – కొమరం భీం మనుమడు

కొమరం భీం మారువేషంలో ముస్లింలా కనిపించాడని చెప్పడానికి చారిత్రక రికార్డులేమి లేవని కొమురం భీమ్ మనవడు సోన్ రావు ఒక వీడియో ద్వారా తెలిపారు. భీమ్ గిరిజనుల భూమి, నీరు, ఇతర వనరుల కోసం పోరాడారని, అలాంటి వ్యక్తిని మైనారిటీ సమాజ సభ్యునిగా సూచించడం చరిత్ర వక్రీకరించడమే అవుతుందని సోన్ రావు అన్నారు. ముస్లిం గెటప్‌ను రాజమౌళి తొలగించాలని, తొలగించని పక్షంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు వ్యతిరేకంగా నిరసన చేపడతామని కొమరం భీం మనుమడు సోన్ రావు హెచ్చరించారు.

రాజమౌళి స్పందిస్తారా?

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మొదట్లోనే ఇలా అభ్యంతరాలకు గురికావడం కాస్త ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభించినపుడు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కథ సగం చరిత్ర ప్రకారం సగం కల్పిత కథతో తీస్తున్నామని రాజమౌళి ప్రకటించారు కూడా. కానీ ఇప్పుడు ఆదిలోనే వివాదాల బాట పట్టడం రాజమౌళికి మింగుడుపడని విషయంగా చెప్పవచ్చు.. గతంలో బాహుబలి రూపొందించినప్పుడు కూడా కాలకేయుని పాత్ర విషయంలో ఒక కులం వారి మనోభావాలు దెబ్బతీసేలా సినిమా రూపొందిందని విమర్శలు చెలరేగాయి. కానీ బాహుబలి విడుదల అనంతరం ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి కొమరం భీం ముస్లిం గెటప్ సీన్ ని తొలగిస్తారా లేక అలాగే ఉంచుతారా అన్నది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. ప్రస్తుతం చెలరేగుతున్న వివాదాలకు, ఎంపీ బాపు రావు ఇచ్చిన వార్నింగ్ కు రాజమౌళి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.