iDreamPost
android-app
ios-app

గవర్నర్‌ రాజకీయ వ్యవస్థ కాదు.. రాజ్యాంగ వ్యవస్థ : బీజేపీ

గవర్నర్‌ రాజకీయ వ్యవస్థ కాదు.. రాజ్యాంగ వ్యవస్థ : బీజేపీ

వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేయడంతో ఏపీ చరిత్రలో కీలక అధ్యాయం ప్రారంభమైంది. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటు పూర్తయింది. అయితే మూడు రాజధానుల ఏర్పాటును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న టీడీపీ, అమరావతిలోని కొన్ని గ్రామాల రైతులు, ఓ వర్గం మీడియాకు గవర్నర్‌ నిర్ణయం ఏ మాత్రం రుచించడంలేదు. దీంతో ఆయా వర్గాలన్నీ బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ప్రారంభించాయి. బీజేపీ మోసం చేసిందంటూ ఆరోపిస్తున్నాయి. ఏపీని బీజేపీ సర్వనాశనం చేసిందని టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతిలోని మహిళలు బీజేపీకి శాపనార్థాలు పెట్టారు. టీడీపీ అనుకూల మీడియాలోనూ బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరశింహారావు మీడియా ముందుకు వచ్చారు. తాజా పరిణామాలపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని పునరుద్ఘాటించారు. ఇందులో కేంద్రప్రభుత్వానికి ఏం సంబంధం లేదని, జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖగా అమరావతిలోనే రాజధాని కొనసాగాలని ఇదివరకే చెప్పామని, రైతులకు న్యాయం జరగాలనే తమ స్టాండ్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి ఏ మాత్రం విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించదని జీవీఎల్‌ పేర్కొన్నారు. టీడీపీ స్వార్థం కోసమే అమరావతిని ఎంపిక చేసుకున్నారని జీవీఎల్‌ విమర్శించారు. గవర్నర్‌ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ కాదని, రాజ్యాంగ వ్యవస్థన్న విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.

అమరావతిపై కేంద్రం జోక్యం చేసుకోకపోవడంపై టీడీపీ నేతల విమర్శలకు జీవీఎల్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో సీబీఐకి ఎంట్రీ లేదని ఏకంగా జీవో జారీ చేశారని, అప్పుడు కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదని జీవీఎల్‌ గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో సీబీఐపై అంక్షలు లేకపోయినా.. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం పెట్టినప్పుడు కూడా రాష్ట్ర అధికారాల్లో కేంద్రం కలుగజేసుకోలేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే.. చంద్రన్న రాజ్యంగం.. ఆయన అధికారంలో లేకపోతే భారత రాజ్యాంగం అమలులో ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు.