Idream media
Idream media
వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై మళ్లీ రాజకీయాలు ప్రారంభం అయ్యాయా..? బహుళార్థక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు రాజకీయ ఆటలో పావుగా మారనుందా..? అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు ఆస్కారం ఇస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు సవరించిన ఆంచనాల ఆమోదంపై కేంద్రం పీటముడి వేయడం, ప్రాజెక్టు అంచనాలను జగన్ ప్రభుత్వం వచ్చాక 55 వేల కోట్ల నుంచి 45 వేల కోట్ల రూపాయలకు తగ్గించినా.. ఆ లెక్కను 25 వేల కోట్ల రూపాయల దిగువకు కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుందన్న అంచానలతో ఒక్కసారి రాజకీయాలు పోలవరం ప్రాజెక్టు చుట్టూ తిరగడం ప్రారంభించాయి.
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని 100 శాతం నిధులతో కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉంది. అయితే చంద్రబాబు హాయంలో తాము నిర్మిస్తామని టీడీపీ ప్రభుత్వం తీసుకుంది. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, పని చేయకుండానే బిల్లుల చెల్లింపు వంటి అవినీతి వ్యవహారాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు బలంగా వచ్చాయి. గత ఎన్నికల ప్రచారంలో రాజమహేంద్రవరం బహిరంగ సభలో నరేంద్ర మోడీ కూడా.. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేశారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని అశేషజన సాక్షిగా ఆరోపించారు. ఎన్నికలు అయిపోయాయి.. ప్రభుత్వం మారింది.. ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న సమయంలో.. తాజాగా ప్రాజెక్టు వ్యయం అంచనాలపై ఏర్పడిన వివాదం రాజకీయ విమర్శలకు ఆస్కారం ఇచ్చింది.
పోలవరం ప్రాజెక్టును వాస్తవవిక అంచనాలతో పూర్తి చేయడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ ఆదివారం విజయవాడలో వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం సాంకేతిక పేరిట అంచనాలను పెంచిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తాము నమ్ముతున్నామన్నారు. ప్రాజెక్టు ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు.
మాధవ్ వ్యాఖ్యలతోనే ప్రాజెక్టుపై రాజకీయాలు మొదలయ్యాయనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ హయంలో ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నమ్ముతున్నామని చెబుతున్న మాధవ్.. ఆ అవినీతి జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వంపై లేదా..? అనే ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం ఉన్నా.. చెప్పలేకపోవచ్చు. అవినీతి జరిగితే.. విచారణ జరిపించి.. నిధులు బొక్కేసిన వారి వద్ద రికవరీ ఎందుకు చేయలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గోడ మీద పిల్ల రాజకీయాల వల్ల ప్రజల విశ్వాసాన్ని ఏ పార్టీ పొందలేదు. ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీకి ఇలాంటి రాజకీయాల వల్ల నష్టమే తప్పా లాభం ఉండదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పోలవరంలో అవినీతి చేసిన వారి పని పట్టి.. ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు సహకరిస్తేనే ఏపీ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ చూరగొనే అవకాశం ఉంది.