iDreamPost
android-app
ios-app

టాక్ ఆప్ ది రాజాసింగ్

టాక్ ఆప్ ది రాజాసింగ్

టి. రాజాసింగ్ .. 2018లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి తుఫానును త‌ట్టుకుని బీజేపీ నుంచి నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే. గోషామహల్‌ నియోజకవర్గం నుంచి ఆయ‌న రెండో సారి నెగ్గారు. న‌చ్చ‌ని అంశాల‌పై దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం అత‌ని నైజం. అప్పుడ‌ప్పుడూ సొంతపార్టీ నేతలపైనా తిరుగుబాటు స్వరం వినిపిస్తుంటారు. గో సంర‌క్ష‌ణ‌లో కీల‌క పాత్ర వ‌హిస్తారు. హ‌నుమ‌జ్జ‌యంతి, శ్రీ‌రామ న‌వమి ఉత్స‌వాల సంద‌ర్భంగా గ్రేట‌ర్ లో భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వ‌హిస్తారు. ఎప్పుడూ వార్త‌లో వ్య‌క్తిగా ఉంటారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, నిర్ణ‌యాలతో వివాదాస్ప‌ద ఎమ్మెల్యేగా పేరుంది. ఉగ్రవాదుల హిట్ లిస్టులో కూడా రాజాసింగ్ పేరు ఉందంటే అర్థం చేసుకోవ‌చ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ గ‌తంలో హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ ఓ లేఖ కూడా రాశారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు పిలిచినా చాలా సార్లు బైకుపైనే ఆయ‌న వెళ్లిపోతారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి వుండటంతో ద్వి చక్ర వాహనంపై తిరగవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణించాలని కమిషనర్ ఆ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పలు సూచనలు చేశారు. అలాగే స్థానికంగా అంద‌రికీ అందుబాటులో ఉంటూ ఎవ‌రికి ఏ అవ‌స‌రం వ‌చ్చినా అదుకోవ‌డంలో ముందుంటాడ‌నే పేరు రాజాసింగ్ కు ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌నను గోషామ‌హ‌ల్ ప్ర‌జ‌లు రెండోసారి గెలిపించారు. తాజాగా ఓ కేసు విష‌యంలో రాజాసింగ్ కు న్యాయ స్థానం ఏడాది పాటు జైలు శిక్ష విధించ‌డంతో ఆయ‌న మ‌రోమారు వార్త‌ల్లో కెక్కారు.

గో సంర‌క్ష‌ణ‌లో కీల‌క పాత్ర వ‌హించే రాజాసింగ్ ఇటీవ‌ల గోవుల త‌ర‌లింపు బండ్ల అడ్డ‌గింపు అంశానికి సంబంధించి మాట్లాడుతూ ” సీపీ, డీజీపీలను ప్రశ్నిస్తున్నా.. మా కార్యకర్తలు ఇలాంటి బండ్లు ఆపితే లాఠీచార్జ్‌ చేసి కేసులు బుక్‌ చేస్తున్నారు. నువ్వు ఎవరు? ఏ అధికారముందని ప్రశ్నిస్తున్నారు. నేరాలు ఆపే అధికారం ప్రజలకు కూడా ఉంటుంది. కొత్తూర్‌ ఎస్సై శ్రీధర్‌ ఒక బండిని డబ్బు తీసుకుని పంపిస్తున్నారు. తన లిమిట్స్‌ దాటడానికి డబ్బు తీసుకుని బ్రోకర్‌గా తయారవుతున్నారు. శాలరీ చాలట్లేదంటే మేము భిక్షం ఎత్తుకుని పోలీసులకు డబ్బులిస్తాం.” అంటూ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. క‌రోనా స‌మ‌యంలో ఢిల్లీ మర్కజ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో అక్క‌డికి వెళ్లి వ‌చ్చి వైద్య పరీక్షలకు సహకరించనివారిని కాల్చి చంపాలని చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయా వ‌ర్గాలు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తాయి… ఇలా ఒక‌టి రెండు కాదు.. రాజాసింగ్ రేపిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల లిస్టు చాలానే ఉంటుంది. ఆయ‌న‌పై న‌మోదైన కేసుల లిస్టు చాంతాడంత ఉంటుంద‌న‌డం అతిశ‌యోక్తి కాదు.

ఏడాది జైలు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి స్పెషల్‌ కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్షను కోర్టు విధించింది. బీఫ్‌ ఫెస్టివల్‌ ఘటనలో రాజాసింగ్‌పై ఐదేళ్ల క్రితం కేసు నమోదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. శిక్ష ఖారారు కావడంతో ఆయన వెంటనే బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. నెలరోజుల్లో హైకోర్టులో తేల్చుకోవాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులపై నాంపల్లి స్పెషల్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. గురువారం ఎంపీ బండి సంజయ్‌, మంత్రి మల్లారెడ్డిలపై వేర్వేరుగా నమోదైన పలు కేసుల్లో నాంపల్లి స్పెషల్‌ కోర్టు విచారణ జరిపింది. కరీంనగర్‌లో బండి సంజయ్‌పై నమోదైన మూడు కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనతోపాటు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి. మంత్రి మల్లారెడ్డిపై నమోదైన కేసులను కొట్టివేయడానికి మాత్రం కోర్టు సమ్మతించలేదు.