Idream media
Idream media
కాదేది కవితకు అనర్హం అన్నారు మహా కవి శ్రీశ్రీ. ఇలాగే కాదేది రాజకీయ విమర్శలకు అనర్హం అని చాటుకుంటున్నారు కొంత మంది రాజకీయ నేతలు. కరోనా వ్యాక్సిన్ కేంద్రంగా దేశంలో రాజకీయాలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ వ్యాక్సిన్ కేంద్రంగా రాజకీయాలు మొదలయ్యాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో సందర్భానికి తగినట్లుగా విమర్శలు చేస్తున్నారు రాజకీయ నేతలు. తాజాగా తెలంగాణలో జరుగుతున్న మినీ పురపోరులో వ్యాక్సిన్ కేంద్రంగా రాజకీయ విమర్శలు సంధిస్తున్నారు బీజేపీ నేతలు.
వయస్సుతో సంబంధం లేకుండా తెలంగాణలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రకటించారు. తెలంగాణ ప్రజలకే కాదు.. రాష్ట్రంలో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించారు. మనిషి ప్రాణాల కన్నా డబ్బు ముఖ్యం కాదన్న కేసీఆర్ వ్యాక్సిన్ కోసం 2,400 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇలా కేసీఆర్ అన్నారో లేదో.. అలా బీజేపీ నేతలు అందుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకోని కేసీఆర్, మంత్రులు.. ప్రజలకు దాన్ని ఉచితంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు. సిద్ధపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునందన్ రావు ఈ విమర్శలను ఎక్కుపెట్టారు.
Also Read : తన దాకా వచ్చాక మేల్కొన్న కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు శుభవార్త
కరోనా నియంత్రణ చర్యలపై కేసీఆర్ సీరియస్‌గా దృష్టి పెట్టలేదనే విమర్శలు ఇప్పటి వరకు వినిపించాయి. వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసుకుని వేయించుకోవాలంటూ కేంద్ర నిర్ణయించిన వేళ.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆయనకు ప్రజల్లో మంచి పేరు తెచ్చింది.
బీజేపీ ప్రజలను గాలికి వదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. వ్యాక్సిన్‌ను 150 రూపాయలకు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని ఈ రోజు ప్రకటించింది. అయితే ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో క్రెడిట్ మొత్తం కేసీఆర్‌కు దక్కకుండా ఉండేందుకు.. రఘునందన్‌రావు తనదైన శైలిలో విమర్శలు చేశారు. దేశం కోసమే తెలంగాణలో వ్యాక్సిన్లు, ఇంజెక్షన్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని చెప్పుకొచ్చారు.
కరోనా వ్యాక్సిన్ కేంద్రంగా బీజేపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల విషయంలోనే కాదు.. బిహార్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీపైనా నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా వ్యాక్సిన్‌ను బీజేపీ చేర్చింది. బీజేపీ గెలిస్తే.. బిహార్ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించింది. అప్పటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఎన్నికల్లో అక్కడ బీజేపీ–జేడీయూ కూటమి విజయం సాధించింది. ఇప్పుడు వ్యాక్సిన్‌కు ధరలు నిర్ణయించడంతో బిహార్ ఎన్నికల వేళ బీజేపీ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.
Also Read : యుద్ధం కాదు.. కనీస సన్నద్ధం లేదు!