iDreamPost
android-app
ios-app

నితీష్ ,హద్దు దాటొద్దంటున్న బీజేపీ

  • Published Jan 18, 2022 | 4:10 AM Updated Updated Mar 11, 2022 | 10:23 PM
నితీష్ ,హద్దు దాటొద్దంటున్న బీజేపీ

బీహార్ లో అధికార భాగస్వాములుగా జనతాదళ్ యునైటెడ్, భారతీయ జనతాపార్టీల మధ్య వైరం మరోసారి రాజుకుంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన ఈ పార్టీలు ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమిని ఓడించాయి. తమ కంటే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ జేడీయూకి మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద అంగీకరించడంతో నితీష్‌ కుమార్ సీఎం సీటులో కూర్చున్నారు. అప్పటి నుంచి తమ అలయెన్స్ లో పెత్తనం కోసం బీజేపీ ఆరాటపడుతోంది. జేడీయూని నియంత్రించే యత్నం చేస్తోంది. ఆ క్రమంలోనే పలుమార్లు విబేధాలు తలెత్తాయి. కొన్నిసార్లు బహిరంగంగా విమర్శలకు పూనుకునే వరకూ వెళ్లాయి.

తాజాగా మరోసారి ఈ వ్యవహారం రాజుకుంది. ఇరు పార్టీలు డిష్షుం , డిష్షుం అనుకునేలా కనిపిస్తున్నాయి.

కూటమి పార్టీల మధ్య సఖ్యత ఉండాలని తాము కోరుకుంటామని, కానీ పరిస్థితులు చేజారితే చూస్తూ ఊరుకోబోమని తాజాగా బీహార్ బీజేపీ చీఫ్‌ సంజయ్ సన్యాన్ హెచ్చరించారు. దాంతో వ్యవహారం బాగా ముదిరినట్టు కనిపిస్తోంది. అందుకు ప్రతిగా జేడీయూ నేతలు కూడా స్పందించారు. నితీష్ కుమార్ ని ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వార్నింగ్ ఇవ్వడాన్ని జేడీయూ తప్పుబడుతోంది. సమస్యలుంటే సర్ధుబాటు చేసుకునేలా చర్చించాలే తప్ప బాహాటంగా హెచ్చరికలు జారీ చేయడం ఏమిటని జేడీయూ ప్రశ్నిస్తోంది.

వాస్తవానికి ఈ వివాదం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత దయా ప్రకాష్ సిన్హా వ్యాఖ్యలతో మొదలయ్యింది. ఆయన సామ్రాట్ అశోక మీద రచించిన పుస్తకానికి ఇటీవల అవార్డు వచ్చింది. గతంలో ఆయన ప్రభుత్వశాఖల అధికారిగా పనిచేశారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో అశోకుడిని, ఔరంగజేబుతో పోల్చడం వివాదాస్పదమయ్యింది. కళింగయుద్ధంలో రక్తపాతం గురించి ప్రస్తావిస్తూ మొఘల్ చక్రవర్తి పాలనను తలపించిందని సిన్హా పేర్కొన్నారు. దాంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. నేరుగా సంజయ్ సిన్హాల్ ఫిర్యాదు చేశారు. ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదయ్యింది.

దీనిని జేడీయూ తప్పుబడుతోంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న రచయిత పట్ల బీజేపీ తీరుని నిరసిస్తోంది. వాక్స్వాతంత్ర్యం హరించేలా వ్యవహరిస్తోందని మండిపడుతోంది. నేరుగా బీహార్ బీజేపీ నేతలతో పాటుగా ప్రధాని మోదీని కూడా ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో తమ వైఖరిని వెల్లడిస్తోంది. దాంతో జేడీయూ నేతలు తమ మిత్రపక్షం బీజేపీ పట్ల అసంతృప్తి, అసహనం చాటుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ, జేడీయూ వైరం సాగుతోంది. ఈ దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జోక్యం చేసుకుని బహిరంగంగా నితీష్ కుమార్ ని హెచ్చరించడం కలకలం రేపుతోంది. కూటమిలో మంటపుట్టిస్తోంది. ఈ పరిణామాలు బీహార్ లో ఆసక్తిగా మారుతున్నాయి. జేడీయూ నేతలు కూడా ఘాటుగా స్పందిస్తున్న తరుణంలో వ్యవహారం ఎటు మళ్లుతుందోననే చర్చ మొదలయ్యింది.