iDreamPost
iDreamPost
జస్టిస్ ఎన్ వి రమణతో సహా పలువురు ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తులపై సీజేకి ఫిర్యాదు చేసిన వైఎస్ జగన్ పై కోర్ట్ ధిక్కారణ కేసు పెట్టాలంటూ ఓ బీజేపీ నాయకుడు డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. అటార్నీ జనరల్ కి ఈ మేరకు ఆయన లేఖ రాశారు. జగన్ తో పాటుగా అజయ్ కల్లం ని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చాలని ఆయన లేఖ రాసిన వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. అశ్విన్ ఉపాధ్యాయ అనే అనే బీజేపీ నేత ఏజీ కే కే వేణుగోపాల్ కి రాసిన లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఇప్పటికే అశ్విన్ ఉపాధ్యాయ ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ కు సంబంధించిన పిల్ దాఖలు చేశారు. ఈ కేసుని జస్టిస్ ఎన్ వీ రమణ బెంచ్ విచారిస్తోంది. కోర్టులకు పలు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రజా ప్రతినిధులపై దేశ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ త్వరగా పూర్తిచేసేందుకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల విచారణ రోజువారీ ప ద్దతిలో నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. జగన్ ఆస్తుల కేసులో ఉన్న అభియోగాలు సహా అన్నింటి మీదా ఇప్పటికే విచారణ జరుగుతోంది.
ఇప్పుడు తాజాగా బీజేపీకే చెందిన అశ్విన్ ఉపాధ్యాయ మరోసారి జగన్ లేఖను ప్రస్తావిస్తూ కలకలం రేపారు. రెండు వారాలయినప్పటికీ ఇప్పటికీ జగన్ లేఖపై తగిన చర్యలు తీసుకోలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తక్షణం సుమోటోగా తీసుకుని జగన్, అజయ్ కల్లంపై కోర్టు ధిక్కారణ పిటీషన్ వేయాలని ఆయన కోరారు. న్యాయవ్యవస్థను దెబ్బతీసేలా పరిణామాలున్నాయని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్ట్ కి కాబోయే జడ్జి మీద దాడిగా వారి లేఖ ఉందని విమర్శించారు.
ఇప్పటికే జగన్ ఫిర్యాదుపై విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. తీవ్ర ఆరోపణలు వచ్చిన తరుణంలో రిటైర్డ్ జడ్జీలతో విచారణ చేయడం ఉత్తమమని పలువురు సూచనలు కూడా చేశారు. అయితే అక్టోబర్ 6న లేఖ రాసి, 10నాడు మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలకు సంబంధించి సుప్రీంకోర్ట్ నిర్ణయం ఇప్పటి వరకూ ప్రకటించలేదు. దానిపై పలు న్యాయవాద సంస్థలు స్పందించాయి. ఈ నేపథ్యంలో తాజాగా అశ్విన్ ఉపాధ్యాయ అటార్నీ జనరల్ కి లేఖ రాయడం ఆసక్తికరమే. అదే సమయంలో సుప్రీంకోర్ట్ ఎలా స్పందిస్తుందన్నది అసలైన కీలకాశం అవుతుంది.