iDreamPost
android-app
ios-app

UP BJP, Somu Veerraju – ఏపీలో యూపీ అజెండా! -బీజేపీ ఎత్తులు.. రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి

  • Published Jan 01, 2022 | 3:08 PM Updated Updated Mar 11, 2022 | 10:29 PM
UP BJP, Somu Veerraju – ఏపీలో యూపీ అజెండా!  -బీజేపీ ఎత్తులు.. రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి

పార్టీకి సరైన క్యాడర్ లేదు.. ప్రజల్లో పట్టు కూడా లేదు.. ఎన్నికలొస్తే చాలు ఏదో ఒక పార్టీ పంచన చేరి కొన్ని ఓట్లు.. వీలైతే రెండు మూడు సీట్లు దక్కించుకునే పరిస్థితి. సొంతంగా ఒక్క అసెంబ్లీ సీటైనా దక్కించుకోలేని దుర్భలత్వం.. ఇదీ రాష్ట్రంలో బీజేపీ వాస్తవ పరిస్థితి. కానీ ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్లు.. గత ఏడాదిన్నర కాలంగా తనను తాను బాహుబలిగా ఊహించుకుంటూ.. ఆకాశానికి నిచ్చెనలు వేస్తోంది. తానే అసలైన ప్రతిపక్షం.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అని బీజేపీ చేస్తున్న ప్రగల్బాలు.. క్షేత్రస్థాయిలో వర్క్ ఔట్ కాకపోవడం.. తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో తలబొప్పి కట్టడంతో కమలనాథులు కలత చెందారు. దాంతో కొత్త అజెండాలను తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ది కోసం అర్రులు చాస్తున్నారు.

రాష్ట్ర సమస్యలు పట్టించుకోరు గానీ..

విభజన గాయంతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు చాలావరకు ఇంకా పరిష్కారం కాలేదు. వాటిని అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తూ క్రమంగా ఒక్కో పథకానికి తిలోదకాలు ఇస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నది తమ పార్టీయే అయినా ఈ సమస్యల పరిష్కారానికి బీజేపీ నేతలు తమ వంతు ప్రయత్నం చేయడంలేదు. పైగా ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాల్లో వితండవాదం చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ పై ప్రజల్లో అసంతృప్తి.. మిగతా పార్టీల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దాంతో వీటిపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తూ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు. ఊర్లు, పేర్లతో సరికొత్త రాజకీయం చేస్తున్నారు.

మార్చేస్తాం.. కూల్చేస్తాం..

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని కాపాడుకునేందుకు ఆలయాలను, పేర్ల మార్పు రాజకీయం చేస్తోంది. రామ మందిర నినాదంతో దశాబ్దాలుగా దేశ రాజకీయలను ప్రభావితం చేస్తున్న కమలనాథులు.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం, కాశీ విశ్వనాథ్ కారిడార్ పేరుతో హడావుడి చేస్తున్న బీజేపీ తాజాగా మధుర శ్రీకృష్ణ జన్మస్థల వివాదాన్ని రెచ్చగొడుతోంది.

అలాగే అలహాబాద్, మొఘల్ సరాయ్, ఝాన్సీ తదితర పట్టణాల పేర్లు మార్చేశారు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు కూడా యోగి బాటలోనే నడుస్తున్నారు. గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చాలని మొదట డిమాండ్ చేశారు. వెంటనే విశాఖలో కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్) పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. పేరు మార్చకపోతే జిన్నా టవర్‌ను తామే కూల్చివేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బెదిరిస్తున్నారు.

మత సామరస్యానికి, ప్రశాంతతకు ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరు. అన్ని మతాలు, వర్ణాలవారు కలిసికట్టుగా జీవిస్తుంటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ నేతలు మతపరమైన అంశాలను తెరపైకి తెచ్చి.. బెదిరింపులకు పాల్పడుతూ ఉద్రిక్తతలు రేపడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ తీరుతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూపీ మాదిరిగా ఇక్కడ మత రాజకీయాలు చేయాలనుకుంటే ఉన్న కాసింత ఉనికి కూడా లేకుండా పోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.