iDreamPost
android-app
ios-app

BJP, UP Elections – యూపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

  • Published Nov 18, 2021 | 10:16 AM Updated Updated Nov 18, 2021 | 10:16 AM
BJP,  UP Elections – యూపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని కాపాడుకునేందుకు బీజేపీ దూకుడు పెంచింది. గత ఏడాదికిపైగా రాష్ట్రంలోని యోగి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని వార్తలు వచ్చిన తరుణంలో వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఎన్నికల్లో నెగ్గాడానికి అనేక తంటాలు పడుతున్న ఆ పార్టీకి ప్రీ పోల్ సర్వేలు కొత్త శక్తి ఇచ్చాయి. సీట్లు తగ్గినా బీజేపీ అధికారం ఖాయమని అంచనా వేసిన నేపథ్యంలో కొత్త ఉత్సాహం పుంజుకున్న కమల దళపతులు ఎన్నికలు ప్రకటించేలోపు పరిస్థితిని మరింత అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇతర పార్టీలకు చెందిన పేరున్న నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. ప్రధానంగా సమాజ్‌వాదీ,బహుజన్‌సమాజ్‌ పార్టీలపై దృష్టి పెట్టారు. ఫలితంగా ఎస్పీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు. బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా పార్టీలో చేరనున్నారని కమలం నేతలు ప్రకటించారు.

అందరూ పేరున్న నేతలే

యూపీ స్థానిక సంస్థల నుంచి ఎన్నికై ఎమ్మెల్సీలుగా ఉన్న రమా నిరంజన్, రవిశంకర్ సింగ్ పప్పు, సీపీ చంద్, అక్షయ్ ప్రతాప్ సింగ్ బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దినేష్ శర్మ, కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగుల సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు. వీరందరూ రాష్ట్రంలో బలమైన ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. తమ ప్రాంతాల్లో మంచి ప్రజాబలం ఉన్న నేతలు కూడా. రమా నిరంజన్ రాష్ట్రంలోనే పేరున్న మహిళా నాయకురాలు. రవిశంకర్ సింగ్ పప్పు దివంగత మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ మేనల్లుడు. చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ ఇంతకుముందే బీజేపీలో చేరారు. సీపీ చంద్ మాజీమంత్రి మార్కండేయ చంద్ కుమారుడు కాగా అక్షయ్ ప్రతాప్ సింగ్ మాజీమంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ (రాజా భయ్యా) కజిన్. కాగా బీఎస్పీ నుంచి కూడా ఆరుగురు ఎమ్మెల్సీలు రెండు మూడు రోజుల్లో బీజేపీలో చేరనున్నారు. వలసలను ప్రోత్సహించేందుకే బీజేపీ రాష్ట్ర శాఖ ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసిందంటే.. ఆపరేషన్ ఆకర్ష్ కు కమలం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం అవుతుంది.

ఆధిక్యతను కాపాడుకునేందుకు..

కరోనా నియంత్రణలో వైఫల్యం, స్థానిక సంస్థల ఎన్నికల్లో చేదు ఫలితాలు, పలు వర్గాలు దూరం కావడం, శాంతిభద్రతలు క్షీణించడం వంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి ఎదురీత తప్పదన్న భావన ఏర్పడింది. అయితే ఇటీవల పలు సంస్థలు నిర్వహించిన ముందస్తు సర్వేల్లో మెజారిటీ తగ్గినా బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వేలు అంచనా వేశాయి. యూపీ అసెంబ్లీలో 403 స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో 312 సీట్లతో బీజేపీ ఘన విజయం సాధించింది. 2022లో జరిగే ఎన్నికల్లో దాదాపు వంద సీట్లు కోల్పోయినా.. 215 నుంచి 240 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేశాయి. ఈ అంచనాలు అధికార పార్టీలో ఉత్సాహం నింపాయి. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున.. ఆలోగా ప్రధాన పక్షాలను దెబ్బ తీసి.. తాను బలపడే విధంగా ప్రముఖ నేతలను చేర్చుకునే కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టింది.

Also Read : UP Election – యూపీలో పొత్తు పొడిస్తేనే నిలిచేది… గెలిచేది..