iDreamPost
iDreamPost
తాజా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో బీజేపీ ఎంపీలే లేని తమిళనాడుకు ఒక మంత్రి పదవి దక్కగా.. ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్ కు మొండి చెయ్యి దక్కింది. బీజేపీ పార్టీపరంగానూ ఏపీకి అన్యాయమే జరిగిందన్న అసంతృప్తి ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. పక్కనున్న తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన తమిళసై సౌందరరాజన్, ఎల్.మురుగన్లకు అనూహ్యంగా పదవులు వరించగా.. దాదాపు అదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకు కొత్త పదవులు మాటేమో గానీ ఉన్న పదవులు పోయాయి.
కన్నా, సోములకు పదవీ వియోగం
రాష్ట్ర విభజన, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పతనానంతర పరిణామాల్లో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ 2014 ఆక్టోబరులో బీజేపీలో చేరారు. అంతకుముందు ఆయన వైఎస్సార్సీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ బీజేపీ పెద్దలు ఆయనకు కేంద్రంలో పదవుల ఆశ చూపించడంతో.. అనూహ్యంగా ఆ పార్టీలో చేరారు. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత బీజేపీ నాయకత్వం ఆయన్ను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించింది. ఆశించిన కేంద్ర పదవి మాత్రం దక్కలేదు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి ఒక్క సీటూ లభించని పరిస్థితుల్లో 2020లో పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు.
కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు.. అంతకుముందే టీడీపీతో పొత్తులో భాగంగా ఎమ్మెల్సీ అయ్యారు. గత నెలే పదవీకాలం పూర్తి కావడంతో ఉన్న ఆ పదవి పోయి.. కేవలం పార్టీ అధ్యక్షుడిగా మిగిలారు. ఆ మధ్య జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బాగా కష్టపడి పార్టీకి మంచి హైప్ తీసుకొచ్చారు. పార్టీ అధ్యక్షులుగా పనిచేసి కష్టపడిన వీరిపై ఢిల్లీ పెద్దలు కరుణ చూపలేదు. అదే సమయంలో మాజీ ఎంపీ, పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నరుగా నియమించడం విశేషం.
Also Read : ఉద్యమాల హరిబాబుకు గవర్నర్ జాబు
తమిళ నేతలకు అలా గౌరవం
ఆంధ్ర నేతల విషయంలో ఇలా వ్యవహరించిన బీజేపీ నాయకత్వం.. తమిళనాడులో పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన ఇద్దరిని మాత్రం పదవుల వరమాలలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. రెండు రోజుల క్రితం జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎల్.మురుగన్ కు బెర్త్ కేటాయించి ఆ పార్టీ నేతలకే షాక్ ఇచ్చారు.
తమిళ సై అనంతరం పార్టీ అధ్యక్షుడిగా అతన్ని నియమించడమే అనూహ్యమనుకుంటే.. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. పార్టీ అధ్యక్షుడు అయ్యేవరకు తమిళనాడులో మురుగన్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. దళిత వర్గానికి చెందిన న్యాయవాది అయిన ఆయన పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రెండుసార్లు హిందూత్వకు మద్దతుగా వెల్ యాత్ర చేపట్టి రెండుసార్లు అరెస్టు అయ్యారు. ఈ యాత్రతో రాష్ట్రంలో బీజేపీకి కాస్త గుర్తింపు లభించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ధరపురం నుంచి స్వల్ప తేడాతో మురుగన్ ఓడిపోయినా.. రాష్ట్రంలో రెండు దశాబ్దాల తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు అడుగుపెట్టడం ఆయనకు కలిసివచ్చి.. కేంద్రమంత్రి పదవిలో కూర్చోబెట్టాయి.
మురుగన్ కు ముందు 2014 నుంచి 2019 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించిన తమిళ సై సౌందరరాజన్ ను 2019 సెప్టెంబరులో ఊహించని విధంగా తెలంగాణ గవర్నరుగా నియమించిన కేంద్ర ప్రభుత్వం ..ఈ ఏడాది ఫిబ్రవరిలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా అదనపు బాధ్యతలు కూడా కట్టబెట్టింది.
తమిళ సై తండ్రి అనంతన్ వెటరన్ కాంగ్రెస్ నాయకుడు. తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా, పలుమార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు. అటువంటి కాంగ్రెస్ కుటుంబానికి చెందిన తమిళ సై 1999లో మెడిసిన్ చదువుతున్నప్పటి నుంచి బీజేపీ రాజకీయాల్లో పాల్గొంటూ అంచెలంచెలుగా ఎదిగారు. బీజేపీలో పలు పదవులు చేపట్టిన ఆమె 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి కరుణానిధి కుమార్తె కనిమొళి చేతిలో ఓడిపోయారు. పార్టీకి ఆమె చేసిన సేవలకు గుర్తుగా గవర్నర్ పదవులు వరించాయి. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షులకు మాత్రం ఆ యోగం పట్టలేదు.
Also Read : దేశ రాజకీయాలను ప్రజ్వలించిన తార జ్యోతిబసు