iDreamPost
android-app
ios-app

శాసనసభ ఎన్నికల బరిలో ఎంపీలు : బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా?

శాసనసభ ఎన్నికల బరిలో ఎంపీలు :  బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా?

ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం, రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఎన్నికలు ఏమైనా విజయవిహారం చేస్తున్న బీజేపీ ఇప్పుడు ఆయా రాష్ట్రాలలో కూడా గెలవాల్సిందేనన్న పట్టుదలతో ఉంది. అయితే పశ్చిమబెంగాల్‌, కేరళలో ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం హేమాహేమీలను బరిలోకి దింపుతోంది. నాలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాను పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతోంది.

బరిలో కేంద్ర మంత్రి

బీజేపీ తొలి జాబితాలో కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో, మెట్రోమేన్‌ శ్రీధరన్‌, మాజీ ఆర్థిక సలహాదారు అశోక్‌ లాహిరి సహా పలువురు ఎంపీలు ఉన్నారు. 140 నియోజకవర్గాలున్న కేరళలో బీజేపీ 115 స్థానాలలో పోటీ చేస్తోంది. వాటిలో ప్రస్తుతం 112 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో పాలక్కాడ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ సీఎం అభ్యర్థి మెట్రోమేన్‌ శ్రీధరన్‌ పోటీ చేస్తుండగా.. కేంద్ర మాజీ మంత్రి అల్ఫోన్స్‌ కంజిరాపల్లి నుంచి పోటీలో నిలుస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి

మొత్తం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలోనూ పశ్చిమబెంగాల్‌ లో పోరు ప్రత్యేకంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సర్వేలు మరోసారి మమతకు అనుకూలంగా ఉన్నాయని తెలిపినప్పటి నుంచీ పార్టీ అధినాయకత్వం మరింత దృష్టి పెట్టింది. పశ్చిమబెంగాల్‌ నుంచి అనేక మంది ప్రముఖులను రంగంలో దించుతోంది. ఈ రాష్ట్రం నుంచి 63 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. వారిలో అలీపూర్‌దార్‌ నుంచి ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అశోక్‌ లాహిరి బరిలో దిగుతుండగా.. టోలీగంజ్‌ నుంచి కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో పోటీ పడబోతున్నారు. ప్రముఖ సినీ నటుడు, సిటింగ్‌ ఎంపీ లాకెట్‌ చటర్జీ చుంచురా నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తుండగా.. మరో ఎంపీ నిశిత్‌ పర్మానిక్‌.. దిన్హతా నుంచి పోటీ చేయబోతున్నారు. వీరితో పాటు మరికొందరు సినీ ప్రముఖుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండడం విశేషం.

తమిళనాడులో ఇలా..

తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రముఖ నటి, సీనియర్‌ నేత ఖుష్బూ సుందర్‌ను థౌజండ్‌లైట్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిపింది. తొలిసారిగా ఆమె ఎన్నికల రణరంగంలో తలపడబోతున్నారు. కమల్‌హాసన్‌ పోటీ చేస్తున్న కోయంబత్తూర్‌ దక్షిణ నియోజకవర్గం నుంచి రాష్ట్ర బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌ను బీజేపీ పోటీలో నిలిపింది. అలాగే, అశోం నుంచి 17 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. వారిలో హసినారా ఖతూన్‌.. బాఘ్బర్‌ నుంచి పోటీ పడనుండగా.. హాజో నియోజకవర్గం నుంచి సుమన్‌ హరిప్రియ బరిలో నిలవనున్నారు. తదుపరి జాబితాలో కూడా మరింత మంది ప్రముఖులు ఉండనున్నట్లు తెలుస్తోంది.