Idream media
Idream media
రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఇంతకాలం నిశితంగా పరిశీలిస్తూ వచ్చిన బిజెపి తాజాగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. దీంతో సిఎం గెహ్లాట్ కు కొత్త తలనొప్పి తప్పదనిపిస్తోంది. ఈ పరిస్థితులకు బిజెపినే కారణమంటూ ఆరోపిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై ఎదురుదాడిని ప్రారంభించింది. ఒకపక్క కాంగ్రెస్‌కు దీటైనా సమాధానం.. మరోపక్క న్యాయస్థానాల్లో గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఇరుకనపెట్టడం వంటి చర్యలకు బిజెపి ప్రణాళిక గీసింది.
అందులో భాగంగానే బిఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేర్చుకోవడంపై బిజెపి కోర్టుకెక్కింది. దీంతో అశోక్ గెహ్లాట్ కు కొత్త తలనొప్పి వచ్చినట్లు అయింది. అసెంబ్లీలో మెజారిటీ చూపించుకోవడం కోసం బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఆరుగు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని, ఆ విషయమై వెంటనే విచారణ చేపట్టాలని రాజస్తాన్ హైకోర్టులో బిజెపికి చెందిన ఎమ్మెల్యే మదన్ దిలావర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అసెంబ్లీలో బీఎస్పీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరినప్పటికీ స్పీకర్ ఈ విషయమై ఎలాంటి చర్యా తీసుకోలేదని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మదన్ పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌ను సోమవారం విచారణకు తీసుకుంటామని కోర్టు పేర్కొంది.
సందీప్ యాదవ్, వాజిద్ అలి, దీప్‌చంద్ ఖేరియా, లఖన్ మీనా, జోగేంద్ర అవానా, రాజేంద్ర గుద.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా, గతేడాది సెప్టెంబర్‌లో అందరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ ఆమోదముద్ర సైతం వేశారు. దీంతో అశోక్ గెహ్లోత్‌కు 107కు ఎమ్మెల్యే మద్దతు పెరిగింది.
గెహ్లాట్ రాజీనామా చేయాలి: బిజెపి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గులాబ్‌చంద్ కటారియా సహా, 12 మంది పార్టీ నేతలు గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను కలిశారు. రాష్ట్రంలో పాలన గాడితప్పుతోందంటూ ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ సంక్షోభం దిశలో రాజస్థాన్ పయనిస్తోందని బిజెపి నేతలు పేర్కొన్నారు. ‘‘రాజ్ భవన్‌ను ప్రజలు ఘెరావ్ చేస్తే తామేమి చేయలేమని సిఎం బెదిరించడం భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 124ను ఉల్లంఘించడమే. గవర్నర్‌కే భద్రత కల్పించలేని ఈ ప్రభుత్వం, ప్రజలకేం రక్షణ కల్పిస్తుంది?’’ అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ కాకుండా గవర్నర్‌కు ఎవరు భద్రత కల్పిస్తారని ప్రశ్నిస్తూ నిర్లక్ష్య వ్యాఖ్యలు చేసిన సిఎం గెహ్లోట్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ప్రస్తుతం అంటువ్యాధుల నిరోధక చట్టం అమల్లో ఉంది. ఈ సమయంలో ఆందోళనలు చేపట్టడం ఆ చట్టాన్ని ఉల్లంఘించడమే’’ అని పేర్కొన్నారు. మరోవైపు గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తామని గవర్నర్ హామీ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. గవర్నర్‌పై సిఎం సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం కొనసాగుతోంది.
అసెంబ్లీ సెషన్స్‌కు కారణం చెప్పాలనే హక్కు గవర్నర్‌కు లేదన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం కేబినెట్ కోరితే ఆయన అసెంబ్లీని సమావేశపరచాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆరు అంశాలపై గవర్నర్ వివరణ కోరగా.. సిఎం గెహ్లోట్ కెబినెట్ భేటీని ఏర్పాటు చేశారు. అనంతరం రాజ్ భవన్‌లో కల్‌రాజ్ మిశ్రాను కలిశారు. గవర్నర్ లేవనెత్తిన అంశాలపై సవివరంగా కేబినెట్ నోట్‌ను సమర్పించారు. అయితే.. ముందుగా నిర్ణయించినట్లు సోమవారం కాకుండా ఈ నెల 31న శాసన సభను సమావేశపర్చాలని అందులో కోరారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు బల నిరూపణ కోసం కాదని, కరోనాపై చర్చకని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. దీంతో రాజస్థాన్ రాజకీయ బంతిని గవర్నర్ కోర్టులోకెళ్లింది.
మరోవైపు ఇదే అంశంపై సిఎం గెహ్లాట్ రాష్ట్రపతిని కలుస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో ప్రధాన మంత్రి ఇంటి వద్ద ఆందోళన చేస్తామని ప్రకటించారు. అయితే రాజకీయ సంక్షోభంతో వేడెక్కిన రాజస్థాన్ లో ఏం జరుగుద్దో వేచి చూడాల్సిందే.