iDreamPost
android-app
ios-app

రత్నప్రభనే ఖాయం చేసిన బీజేపీ, కమలదళం ఆశలు పండేనా

రత్నప్రభనే ఖాయం చేసిన బీజేపీ, కమలదళం ఆశలు పండేనా

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అనేక కసరత్తులు తర్వాత చివరకు కర్ణాటక మాజీ సీఎస్ పేరుని ఖాయం చేసింది. మాజీ ఐఏఎస్ అధికారులు పోటీపడగా అందులో రత్నప్రభ అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసింది. అధికార ప్రకటన కూడా వెలువడడంతో కమలదళం బ్యూరోక్రాట్ ని బరిలో దింపడం ఆసక్తిగా మారింది. రాజకీయంగా బీజేపీ ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఏపీలో బలపడ్డామనే సంకేతాలు ఇవ్వడమే కాకుండా, టీడీపీని వెనక్కి నెడితే రాష్ట్రంలో ఓ పోటీదారునిగా మారేందుకు దోహదపడుతుందని భావిస్తోంది. దాంతో బలమైన అభ్యర్థిని బరిలో దింపుతామని ప్రకటిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే బీజేపీ అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో రత్నప్రభకి టికెట్ ఖాయం అయినట్టు కనిపిస్తోంది.

రత్నప్రభ భర్త కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యాసాగర్ కూడా ఏపీలో అనేక కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కూడా ఉమ్మడి ఆంధ్రలో డిప్యూటేషన్ పై పనిచేశారు. ఆ సమయంలో వైఎస్సార్ ప్రభుత్వంలో ఆమెకు ప్రాధాన్యత దక్కింది. జగన్ పై నమోదయిన కేసుల్లో కూడా ఆమె పేరు ప్రస్తావనకు వచ్చింది. చివరకు వైఎస్సార్ ని కీర్తిస్తూ రత్నప్రభ సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా చేశారు. ఇక తాజాగా ఆమె బీజేపీ తరుపున వైఎస్సార్సీపీ అభ్యర్థిపై పోటీపడుతుండడం విశేషం.

కర్నాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన రత్నపభ పదవీవిమరణ తర్వాత బీజేపీలో చేరారు. తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఆమె ఆశాభావంతో కనిపించారు. మరో ముగ్గురు అధికారులతో పాటుగా ఆమె కూడా గట్టిగా ప్రయత్నాలు చేశారు. రిటైర్డు ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసులు దాదాపుగా తానే అభ్యర్థినంటూ ప్రచారం కూడా నిర్వహించారు. గడిచిన ఏడెనిమిది నెలలుగా తిరుపతి కేంద్రంగా కార్యకలాపాలు చేపడుతున్నారు. అయితే చివరకు ఆయన్ని కాదని రత్నప్రభని ఖరారు చేయడం వెనుక కర్ణాటక బీజేపీ పెద్దల పాత్ర ఉందనే వాదన ఉంది. ఏపీకి చెందిన నేతలంతా దాసరి శ్రీనివాస్ వైపు మొగ్గుచూపినా చివరకు అధిష్టానం మాత్రం రత్నప్రభను ఖాయం చేసింది. మరో అధికారి రిటైర్డు డీజీపీ కృష్ణప్రసాద్‌ తోపాటుగా తిరుపతి బీజేపీ నేత మునిసుబ్రమణ్యం కూడా టికెట్ ఆశించారు. చివరకు రత్నప్రభ తెరమీదకు రావడంతో ఇప్పుడు తిరుపతి బీజేపీ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది.

ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాలతో పాటుగా ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం కూడా తోడుకావడంతో ఏపీలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. ఇటీవల స్థానిక ఎన్నికల్లో విద్యావంతుల్లో బలముందని చెప్పుకునే బీజేపీకి ఒకే ఒక్క కార్పోరేటర్ స్థానం గెలవడం దానికో నిదర్శనం. దాంతో ఈసారి తిరుపతి ఉప ఎన్నికల్లో ఆపార్టీకి ఏమేరకు పంజుకునే అవకాశం దక్కుతుందనేది సందేహంగా మారింది. రెండేళ్ల క్రితం సాధారణ ఎన్నికల్లో నోటా కన్నా తక్కువగా ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కూడా కోల్పోయిన బీజేపీ ఈసారి ఏమేరకు రాణిస్తుందో చూడాలి.