Idream media
Idream media
తిరుమల శ్రీవారి ఆలయాన్ని చులకనగా మాట్లాడారని మంత్రి కొడాలి నానిపై మంగళవారం తిరుపతి అర్బన్ అదనపు ఎస్పీకి కొందరు జాతీయ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో ఆయన కూడా ఉన్నారు. జగన్ సర్కార్‌కు మీడియాలో శత్రువులు ఎక్కువ కదా! అందులోనూ మత సంబంధ విషయాలపై ఫిర్యాదు చేయడంతో, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు పోలోమని ఆయన ముందు మైకులు పెట్టారు.
భానుప్రకాశ్ రెడ్డి,తిరుపతిలో ఆయన కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్న జాతీయ పార్టీ నాయకుడు. ప్రచారంలో ఆయన “భానుడి”లా ధగాధగా “ప్రకాశి”స్తుంటాడు. తిరుపతి బీజేపీలో తానొక్కడే ఉండాలనేది ఆయన ఆశ. ఒకవేళ ఖర్మకొద్దీ ఎవరి ద్వారానైనా పార్టీలోకి వచ్చినా ఆయన ఏ మాత్రం పట్టించుకోరు. ఏ కార్యక్రమానికి పిలవరు. అసలు తన నాయకత్వంలో ఏదైనా చేయడం కూడా అరుదే. ఎందుకంటే ఆయన వెంట ఆయన నీడ తప్ప…మచ్చుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరని…సొంత పార్టీ కార్యకర్తలే చెబుతుంటారు.
ఇంకేం చెప్పేది? మైకులు కనిపించగానే కొడాలి నాని అలా ఎలా మాట్లాడుతారు? జగన్ ఫలానా ఫలానా యాక్ట్ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలంటూ వాటి వివరాలు చెప్పాడు. హిందువుల మనోభావాలను గాయపరిచిన కొడాలి నానిని జగన్ వెంటనే బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత వరకూ బాగానే ఉంది. మరి ఆయన వెంట చెప్పుకోతగ్గ పార్టీ నేతలేరీ? ఉండరంతే. ఎందుకంటే ఆయనకు పార్టీలో మెరుపు తీగ అని పేరు. ఏదో మీడియా ముందుకు వచ్చి షో చేసే యాక్టరే తప్ప యాక్టివిస్ట్ కాదని సొంత వాళ్లే గుసగుసలాడుతారు.
తిరుపతికి బీజేపీ మహిళానేత శాంతిరెడ్డి రాష్ట్ర స్థాయిలో ఒకప్పుడు ఫైర్‌బ్రాండ్. ఇప్పుడు వయస్సు పెరిగిన రీత్యా పెద్దగా తిరగడం లేదు. కానీ ఆమె తిరుపతిలోనే ఉంటారు. ఇటీవల రాంమాధవ్ సమక్షంలో బీజేపీలో చేరిన ప్రముఖ వైద్యురాలు కృష్ణప్రశాంతి, చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాదరణ కలిగిన సైకం జయచంద్రారెడ్డి తదితరులను కలుపుకుపోవాలని ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదు.
నెల్లూరు వెంకన్న ఆశీస్సులతో తిరుమల వెంకన్న సేవ చేసుకునేందుకు టీడీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఆయనకు అవకాశం దక్కింది. జాతీయ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు, స్వామికార్యం, స్వకార్యం అన్నట్టుగా టీటీడీ పదవిని బాగా వాడుకున్నాడనే పేరు. బీజేపీ జాతీయ నాయకుల రాక తెలియగానే రేణిగుంట విమానాశ్రయంలో చక్కటి వస్త్రధారణతో, చేతిలో బొకేతో సిద్ధంగా ఉంటాడాయన. ఆ తర్వాత తిరుమలలో స్వామి సేవలో నేతలు తరిస్తే, వచ్చిన నాయకుల సేవలో ఈయనగారు తన్మయత్వం పొందుతారని సొంత పార్టీ కార్యకర్లలు, నాయకుల నుంచి వినబడుతున్న విమర్శలు.
కేంద్రంలో ఈయన గురువు గారు రాజ్యాంగ పదవిలోకి వెళ్లడంతో ఈ భాను “ప్రకాశం” మసకబారిందని తిరుపతి టాక్. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్నట్టు దేవుని పేరుతో ఇంకెన్నాళ్లు పబ్బం గడుపుకుంటాడోనని సొంతవాళ్ల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. పేరుకు మాత్రం ఏళ్లతరబడి పార్టీలో ఉంటున్నాడనే మాటే తప్ప, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని పలుకుబడి తిరుపతిలో ఆయన సొంతమని బీజేపీ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడాలాంటి నేత కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు, ఒకవేళ పోలీసులు కేసు నమోదు చేయకపోతే ప్రైవేట్ కంప్లైంట్ చేస్తానని హెచ్చరికలు…అబ్బో డ్రామా బాగా పండిస్తున్నాడే.