iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిని ఎట్టకేలకు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి తగ్గట్టుగా కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ పక్కన పెట్టింది. ఆయన స్థానంలో సీనియర్ నేత సోము వీర్రాజుని సారధిగా ప్రకటించారు. దాంతో రాజకీయంగా ఇది కీలక పరిణామంగా కనిపిస్తోంది. ఒకే సామాజికవర్గానికి చెందిన కన్నాని కాదని సోము వీర్రాజుని ఏపీ బీజేపీకి అధ్యక్షుడిగా ప్రకటించడం ద్వారా బీజేపీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.
గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేసి, 2014 ఎన్నికల తర్వాత బీజేపీ లో చేరిన కన్నాకి అనతికాలంలోనే మంచి గుర్తింపు దక్కిందని చెప్పవచ్చు. ఏకంగా అప్పటి విశాఖ ఎంపీగా ఉన్న కంభంపాటి హరిబాబుని తొలగించి, కన్నాకి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అప్పట్లో సోము వీర్రాజు , పైడికొండల మాణిక్యాలరావు వంటి వారి పేర్లు వినిపించినా అనూహ్యంగా కన్నాకి కిరీటం దక్కింది. 2019 ఎన్నికల్లో కన్నా నాయకత్వంలోనే బీజేపీ బరిలో దిగింది. బోణీ కూడా కొట్టలేకపోవడమే కాకుండా ఘోర పరాజయం చవిచూసింది.
Also Read: తెలుగునేల నుండి లోక్ సభకు ఎన్నికైన తొలి మహిళ – సంఘం లక్ష్మీ భాయి
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో ఏపీలో బలోపేతం కాగలమని బీజేపీ ఆశిస్తోంది. దానికి అనుగుణంగా బలహీనపడుతున్న టీడీపీ స్థానంలో విపక్ష స్థాయికి చేరాలని అంచనావేస్తోంది. అందులో భాగంగానే కన్నా ని తప్పించి కొత్త అధ్యక్షుడి కోసం ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో పలువురి పేర్లు వినిపించాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీలో టీడీపీ అనుకూల నేతలు కూడా గట్టిగా ప్రయత్నాలు చేశారు. తెలంగాణాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చినప్పుడే ఏపీలో కూడా మార్పు జరుగుతుందని ఆశించినా అది జరగలేదు.
Also Read: మొద్దు శ్రీను హత్యలో దోషి ఓం ప్రకాశ్ మృతి
ఎట్టకేలకు కన్నా స్థానంలో సోము వీర్రాజు రావడంతో ఏపీ బీజేపీలో కొత్త పోకడ ఖాయమని భావిస్తున్నారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ లో చేరి, ఆ తర్వాత బీజేపీలో జాతీయ కార్యవర్గం వరకూ సోము వీర్రాజు పలు పదవులు దక్కించుకున్నారు. రాజమండ్రి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పలుమార్లు పోటీ చేసినా ఆయనకు విజయం దక్కలేదు. గత ప్రభుత్వంలో టీడీపీ మద్ధతుతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు ధోరణి మీద ఆయన తీవ్రంగా మండిపడుతూ నిత్యం వార్తల్లో నిలిచేవారు. రాజకీయంగా దూకుడుగా ఉండే సోము వీర్రాజు బీజేపీ అద్యక్షుడు కావడంతో ఆంధ్రాలో పలువురు టీడీపీ అనుకూల కమల శిబిరం నేతలకు కంటగింపుగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. దాంతో రాబోయే రోజుల్లో ఆపార్టీ వ్యవహారాలు ఆసక్తికరంగా మారడం ఖాయం అని చెప్పవచ్చు.