iDreamPost
iDreamPost
దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను మొత్తంగా చూస్తే బీజేపీ, దాని మిత్రపక్షాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ పార్టీపరంగా బీజేపీకి ఒకటి రెండు రాష్ట్రాల్లో గట్టి దెబ్బ తగిలింది. అటువంటి వాటిలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కమలానికి ఉప ఎన్నికల ఫలితాలు శరాఘాతంగా పరిణమించాయి.అక్కడ ఉప ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోవడం బీజేపీ వర్గాలను కలవరపాటుకు గురిచేసింది. ఈ ఫలితాలు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను ప్రతిఫలించాయని అంటున్నారు. వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉన్న తరుణంలో ఈ ఫలితాలు కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపగా.. అధికార బీజేపీలో అంతర్మధనానికి దారితీశాయి.
సీఎం సొంత జిల్లా.. నడ్డా సొంత రాష్ట్రం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. మరోవైపు ఉప ఎన్నిక జరిగిన మండీ పార్లమెంటు నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సొంత జిల్లా. అయినా వారి ప్రభావం ఉప ఎన్నికల్లో ఏమాత్రం పనిచేయలేదు. మండీ పార్లమెంటు నియోజకవర్గాన్ని 2014, 2019 ఎన్నికల్లో బీజేపీయే గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి రామ్ స్వరూప్ శర్మ ఏకంగా 4 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. ఆయన మృతితో ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభాసింగ్ సుమారు 9 వేల ఆధిక్యతతో గెలవడం విశేషం. అంటే గత మెజారిటీ 4 లక్షల ఓట్లు, ప్రస్తుతం కాంగ్రెస్‌కు వచ్చిన 9 వేల మెజారిటీ కలిపి మొత్తం 4.09 లక్షల ఓట్లను రెండున్నరేళ్లలోనే బీజేపీ కోల్పోయిందన్న మాట. ఇక ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో ఒకటే కాంగ్రెస్ సిటింగ్ నియోజకవర్గం. మిగతా రెండు బీజేపీ స్థానాలు. అవన్నీ కాంగ్రెసుకు దఖలుపడ్డాయి. జుబ్బల్ కోట్కాయ్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అక్కడ ఆ పార్టీ అభ్యర్థి నీలం సైరెక్ కు కేవలం 2584 ఓట్లు (5 శాతం లోపే) లభించాయి. ఊరుపేరు లేని అభ్యర్థిని నిలబెట్టడమే ఈ దుస్థితికి కారణమని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు.
బీజేపీ పాలనపై రిఫరెండం
ఉప ఫలితాలు రాష్ట్ర, కేంద్రాల్లో బీజేపీ పాలనపై చాప కింద నీరులా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మండీలో ఓటమి ప్రభావం దాదాపు ఎనిమిది జిల్లాలపై ఉంటుందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ పాలన వైఫల్యాలు, పెట్రో ఇతర నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలే అజెండాగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. మరోవైపు నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేశామంటూ బీజేపీ ప్రచారం చేసింది. కాంగ్రెస్ గెలవడంతో ప్రజలు బీజేపీ వాదనను తిరస్కరించినట్లు స్పష్టం అవుతోంది. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కుల్దీప్ సింగ్ రాథోడ్ ఈ ఫలితాలను బీజేపీ సర్కారుపై రిఫరెండంగా అభివర్ణించారు.