iDreamPost
android-app
ios-app

ఇన్నాళ్లూ లేని శ్రద్ద ఇప్పుడెందుకు?

  • Published Feb 16, 2022 | 4:29 AM Updated Updated Feb 16, 2022 | 4:29 AM
ఇన్నాళ్లూ లేని శ్రద్ద ఇప్పుడెందుకు?

నేల విడిచి సాము చేసినట్టు ఇన్నాళ్లూ రాజకీయం నడిపిన బీజేపీ, జనసేన ఇప్పుడిప్పుడే వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోంది. పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసుకోకుండానే 2019 ఎన్నికల బరిలో దిగి ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పార్టీలు పరువు పోగొట్టుకున్నాయి. అయినా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించకుండానే ఈ రెండున్నర ఏళ్లు కాలక్షేపం చేశాయి. స్థానిక, మునిసిపల్, పరిషత్, తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల్లో ఘోరంగా తగిలిన ఎదురుదెబ్బలతో వాటికి తత్త్వం బోధపడింది. అందుకే ఇప్పుడు రెండు పార్టీలు సంస్ఠాగతంగా బలపడడంపై దృష్టి పెట్టాయి.

జనసేన నిర్మాణం పూర్తయినట్టే!

జనసేన గ్రామ, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేసే పనిని పూర్తి చేసింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచనల మేరకు నాదెండ్ల మనోహర్ ఈ ప్రక్రియను దాదాపు పూర్తి చేశారంటున్నారు. అయితే చెప్పుకోదగ్గ పేరు, గుర్తింపు ఉన్న నాయకులు వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పటికీ కేడర్ పై కన్నా లీడర్ పవన్ కల్యాణ్ గ్లామర్ పైనే ఆ పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది.

బీజేపీలోనూ పెరిగిన జోరు..

బద్వేల్ ఉప ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లు కూడా లేని దుస్థితి బీజేపీ ఎదుర్కొంది. తెలుగుదేశంతో కుదుర్చుకున్న లోపాయికారీ ఒప్పందంతో ఆ పార్టీ కార్యకర్తలనే ఏజెంట్లుగా పెట్టుకొంది. ఆ ఎన్నికలలో పార్టీ ఓటమి కన్నా ఈ విషయమే బీజేపీ పరువుతీసింది. అందుకే పార్టీ నిర్మాణంలో బూత్ స్థాయి కమిటీలకు బీజేపీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి ఐదు పోలింగ్ బూత్ ల పరిధిని ఒక శక్తి కేంద్రంగా నిర్ధారించుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకొంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్లమెంటరీ జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ ఈ విషయంలో సూచనలు ఇస్తున్నారు. ఈ పార్టీ ప్రధాని మోదీ గ్లామర్ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది.

పొత్తుల బేరసారాలకేనా ఈ కసరత్తులు?

పరిపాలనా సంస్కరణలతో, సంక్షేమ పథకాల అమలుతో దూసుకుపోతున్న అధికార వైఎస్సార్ సీపీని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే పొత్తులు అనివార్యమని రాష్ట్రంలో అన్ని పార్టీలు గుర్తించాయి. అయితే ఏఏ పార్టీల మధ్య స్నేహాలు పుట్టుకొస్తాయి? ఎవరెవరి మధ్య వికటిస్తాయి? అన్నది ఆసక్తికరం. 2019 ఎన్నికల్లో ఒంటరి పోరాటాలు చేసిన బీజేపీ, జనసేనకు తమ బలం ఏమిటో తెలిసివచ్చింది. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళితే ఉపయోగం లేదని అర్థమైంది. అందుకే ఎన్నికలు ముగిసిన ఏడాదికే పొత్తు కుదుర్చుకున్నాయి.

మరోపక్క టీడీపీది కూడా ఇదే పరిస్థితి. చంద్రబాబు నాయకత్వంలో ఆ పార్టీ ఇప్పటివరకూ పొత్తులు లేకుండా ఒక్కసారి కూడా అధికారం చేపట్టలేకపోయింది. అందువల్ల ఈ మూడు పార్టీలకు పొత్తులు ఒక చారిత్రక అవసరంగా పరిణమించాయి. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు. గతంలో రెండుసార్లు 1999, 2014 ఎన్నికల్లో బీజేపీ వల్ల మిత్రలాభం పొందిన చంద్రబాబు ఎలాగైనా సరే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

అయితే బీజేపీ ఈయనను నమ్మదగిన మిత్రుడిగా గుర్తించడం లేదు. తన చిరకాల మిత్రుడు పవన్ కల్యాణ్ ద్వారా కమలనాధులతో సఖ్యతకు చంద్రబాబు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఫలిస్తే ఈ మూడు పార్టీలు జట్టు కడతాయి. లేదంటే పవన్ ను బీజేపీ నుంచి వేరు చేసి జనసేన, సీపీఐలతో పొత్తు పెట్టుకోవాలనేది చంద్రబాబు ప్లాన్ బి. మొత్తంమీద ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా సీట్లు బేరం ఆడాలంటే తమకూ గ్రామస్థాయి వరకు బలం ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది. హఠాత్తుగా ముందస్తు ఎన్నికలు ఊడిపడితే పొత్తుల వేళ బేరం ఆడే శక్తి ఉండదు. అందుకే పార్టీ నిర్మాణ ప్రక్రియపై జనసేన, బీజేపీ ఇంత శ్రద్ధ కనబరుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Also Read : విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం పవన్‌ గాలికొదిలేశారా?