iDreamPost
iDreamPost
రాష్ట్రంలో బీజేపీ–జనసేనల పొత్తుతో కొత్త చరిత్రకు నాంది పలుకుతాం.. ఇరు పార్టీల నాయకులు మీడియా ముందు చెప్పిన మాటలు. ఇది జరిగి ఇంకా కొన్ని నెలలు కూడా కాలేదు. అయితే వ్యవహారంలో కొచ్చేసరికి మాత్రం ఇరు పార్టీల నాయకులదీ చెరోదారన్నట్టుగానే ఉంటోంది. ముఖ్యంగా చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో ఇరు పార్టీల మధ్య స్పష్టత కొరవడినట్లుగా ఆయా పార్టీల వ్యవహారశైలిని పరిశీలిస్తే అర్ధమవుతోందని పలువురు చెబుతున్నారు.
ఒక పక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని ఘంటాపథంగా చెబుతున్నారు. తద్వారా ఏపీలో జరుగుతున్న రాజకీయరగడ విషయంలో బీజేపీని పెద్దమనిషి పాత్రకు పరిమితం చేసే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. మరో వైపు ఆ పార్టీతో మైత్రిని కొనసాగిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం అమరావతిలోనే రాజధాని ఉంచాలని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. తద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమలను పక్కన బెట్టి అమరావతి ప్రాంతం వైపే తానున్నట్లు చెప్పకనే చెప్పారు.
పొత్తుపేరిట కలిసిన ఈ రెండు పార్టీలు అనుసరిస్తున్నది వ్యూహమా? చెరోదారీ చూసుకుంటన్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు జనం నుంచి విన్పిస్తున్నాయి. వాస్తవానికి పార్టీల మధ్య పొత్తులు ఉంటే ఇరు పార్టీల ప్రాథమిక సిద్ధాంతాలకు ఇబ్బందుల్లేకుండా లేదా వారివారి పార్టీల స్ట్రాటజీలను బట్టి కామన్ మినిమమ్ ప్రోగ్రాం (సీయంపీ) ఒకటుంటుంది. అసలు ఏపీలో మంచి స్థాయికి చేరదామనుకుంటున్న ఈ రెండు పార్టీలకు అటువంటి సీయంపీ ఏమైనా ఉందా అన్నదే ఇప్పుడు సందేహాలను రేకెత్తిస్తోంది.
కేంద్రంలో ఉన్న అధికారం ద్వారా దక్షిణాధి రాష్ట్రాల్లో తమదైన ముద్ర వెయ్యాలన్న దూరాలోచనతోనే బీజేపీ అగ్రనాయత్వం వ్యవహరిస్తుందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. దీని కారణంగానే దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో తమతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలను కలుపుకుని, తమ స్టాండ్‌ను సుస్థిరం చేసుకోవాలన్న దిశగా ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీలో జనసేనను వారు ఎంచుకున్నారు. పలు మార్లు పవన్ కళ్యాణ్ నరేంద్రమోడీని కూడా కలిసారు. దీంతో బీజేపీ–జనసేనల మైత్రి బలంగానే పెనవేసుకుంటుందన్న సంకేతాలనిచ్చారు.
కానీ అమరావతి విషయంలో ఇరు పార్టీల వైఖరి భిన్నంగా ఉండడంతో ఈ రెండు పార్టీలు పొత్తుపై జనంలో ఇప్పుడు సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీ నాయకులు మతం ప్రాతిపదికగా ఇటీవల పోరాటాలకు దిగుతున్నారు. అయితే అందరితోనూ కలిసి, జనసేన పార్టీని బలపర్చుకోవాలన్న లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నారు. మత పోరాటాల విషయంలోనే పవన్ కళ్యాణ్ బీజేపీతో పోలిస్తే రెండడుగులు వెనక్కి ఉన్నట్లుగా ఆయన వ్యవహారశైలిని చూస్తేనే అర్ధమవుతోంది. ఇలా ఆదిలోనే భిన్నదారులు ఎంచుకుంటే భవిష్యత్తులో బీజేపీ, జనసేనల పొత్తు ఎలా ఉంటుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.