iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేక సూచనలు చేసిన నేపథ్యంలో ఇక్కడ ఆ పార్టీ పుంజుకొనే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏపీలో పార్టీ పరిస్థితిని బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకొంది. తిరుపతి తాజ్ హోటల్‌లో సోమవారం బీజేపీ కీలక నాయకుల సమావేశం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చిన అమిత్ షా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరిలతో భేటీ అయ్యారు. బీఎల్ సంతోష్, శివప్రకాష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు పార్టీ పరిస్థితిపై సమాలోచనలు చేశారు. ఈ భేటీలో అమిత్ షా కొన్ని సూచనలు చేశారు. రాష్ట్రంలో అధికార వైఎస్సార్ సీపీకి, ప్రతిపక్ష టీడీపీకి సమాన దూరం పాటించాలని, పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేయాలని, జనసేనతో కలసి అధికారం చేపట్టే దిశగా కార్యాచరణ రూపొందించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
పరస్పరం ఆధార పడటం తప్ప పటిష్ట పరిచే చర్యలేవీ..
రాష్ట్రంలో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పటి వరకూ సాధించిన దేమిటో ఆ పార్టీల నాయకులకే అర్థం కావడం లేదు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీఎస్పీ, కమ్యూనిస్టుల స్నేహానికి గుడ్ బై చెప్పి జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. తన పార్టీ ఎదుగుదలకు ఒక జాతీయ పార్టీ అండ అవసరమని భావించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ విధంగా బీజేపీ దరికి చేరారు. రాష్ట్రంలో బలమైన వైఎస్సార్ సీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే సినీ గ్లామర్ తోడ్పడుతుందని నమ్మి బీజేపీ నాయకులు జనసేనతో చెలిమికి చేయి చాచారు. ఆ విధంగా పరస్పరం ఆధారపడి ఎదుగుదామని ప్రారంభించిన వారి ప్రస్థానం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఇటీవల వరుసగా జరిగిన పంచాయతీ, పరిషత్, మునిసిపల్, తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు తార్కాణం.
Also Read : Chandrababu, Jagan, Amit Shah – చంద్రబాబుకి, జగన్ కి తేడా అదే, అమిత్ షా సమక్షంలో మరోసారి సుస్పష్టం
ఇరుపక్షాలు వారి పార్టీల బలోపేతానికి చేసిన కృషి దాదాపు శూన్యం అని చెప్పవచ్చు. పొత్తు ఉన్నప్పటికీ జనసేన తన ఒకప్పటి మిత్ర పక్షమైన టీడీపీతో చెలిమికి మొగ్గు చూపుతోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. వీలైతే బీజేపీని కూడా టీడీపీతో పొత్తుకు ఒప్పించాలని ప్రయత్నం చేస్తోందని వార్తలు వస్తున్న విషయం విదితమే. అయితే బీజేపీ అందుకు సుముఖంగా లేదని, టీడీపీతో పొత్తుకు ఆ పార్టీ అగ్ర నాయకులు సుతరమూ ఇష్టపడడం లేదని ఇప్పటికే ఒకటికి రెండుసార్లు స్పష్టంగా వెల్లడయింది. దీనికి తాజాగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.
పొత్తు కొనసాగుతుందా?
పార్టీ ప్రారంభించక ముందు నుంచే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో ఏ స్టాండ్ తీసుకుంటారో చూడాలి. టీడీపీ లేకుండా ఒక్క బీజేపీతో చెలిమిని ఆయన కొనసాగిస్తారా అన్నది ఆసక్తి కరం. అలా అని రోజురోజుకి ప్రజాదరణ కోల్పోతున్న టీడీపీతో బహిరంగంగా పొత్తుకు నిర్ణయం తీసుకుంటారా? లేక ఇంకొన్నాళ్ల పాటు రహస్య మిత్రుడిగా కొనసాగుతారా అన్నది తేలాల్సి ఉంది.
కమలం వికసిస్తుందా?
తలకాయ మాత్రమే మరీ పెద్దగా ఉండి శరీరంలో మిగిలిన భాగాలు పీలగా ఉన్న కార్టూన్ను తలపించేలా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఉంది. నాయకులు తప్ప కార్యకర్తలు పెద్దగా లేని దుస్థితి నెలకొంది. కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా లేక టీడీపీ, జనసేనలపై ఆధారపడిన స్థితిని ఇటీవల బద్వేల్ ఉప ఎన్నికల్లో చూశాం. అలాంటి స్థాయి నుంచి బలమైన అధికార పార్టీకి పోటీ ఇచ్చే స్థితికి బీజేపీని బలోపేతం చేయడం ఆషామాషీ విషయం కాదు. పార్టీ బలపడాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలి. రాష్ట్రం విడిపోయిన తరువాత ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు పరిష్కరించాలి. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలి. రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు అందించాలి. అప్పుడు జనంలో పార్టీ అభిమానం పెరుగుతుంది. నాయకులు వారిని ఓట్లు అడగడానికి వీలు ఉంటుంది. ఆ దిశగా బిజెపి పెద్దలు ప్రయత్నాలు చేయాలి. లేదంటే ఏపీలో బలపడం మాటలకే పరిమితం అవుతుంది.
Also Read : Special Status -ప్రత్యేక హోదాపై పట్టువీడని జగన్