iDreamPost
android-app
ios-app

పంజాబ్ లో చీలిన బీజేపీ కూటమి

పంజాబ్ లో చీలిన బీజేపీ కూటమి

త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల‌లో ఇప్ప‌టి నుంచే రాజ‌కీయంగా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వ‌ల‌స‌లు, పొత్తులు మొద‌ల‌య్యాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో కొత్త పొత్తు పొడిచింది. రెండు, మూడు దశాబ్ధాల పాటు బీజేపీతో కలిసి సాగించిన జర్నీకి కొన్ని నెలల క్రితం బ్రేకప్ చెప్పిన శిరోమణి అకాలీదళ్ తాజాగా బీఎస్పీతో జతకట్టింది. ఈ పొత్తును బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఇది చరిత్రాత్మక చర్య అని అభివర్ణించారు.

చిచ్చు రేపిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు

మరో 9 నెలల్లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ రెండు పార్టీలు 1996 లోక్‌సభ ఎన్నికల్లో చివరిసారిగా కలిసి పోటీ చేశాయి. 2017 పంజాబ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అకాలీదళ్ పార్టీలు ప్రతిపక్షానికే పరిమితమయ్యాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నాలుగేళ్ళు కలిసే వున్న అకాలీదళ్, బీజేపీల మధ్య వ్యవసాయ చట్టాలు చిచ్చు రేపాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న శిరోమణి అకాలీదళ్ పార్టీ.. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కూటమి నుంచి వైదొలిగింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీఎస్పీతో జతకట్టింది శిరోమణి అకాలీదళ్.

సీట్ల లెక్క కూడా తేల్చేశారు..

తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేయనున్నట్లు శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ జూన్ 12న వెల్లడించారు. పొత్తులో భాగంగా దళితుల ఓట్లు అధికంగా వుండే దోబా రీజియన్‌లోని 8, మాల్వా ఏరియాలోని 7, మాఝా రీజియన్‌లోని 5 అసెంబ్లీ సీట్లు కలిపి మొత్తం 20 సీట్లలో బీఎస్పీ పోటీ చేస్తుందని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. పంజాబ్ వికాసమే యువత సరికొత్త మంత్రం అన్న నినాదంతో రెండు పార్టీలు వచ్చే ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయని ఆయన తెలిపారు. కాగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 111 సీట్లలో పోటీ చేసిన బీఎస్పీ ఒక్క చోటా విజయం సాధించలేకపోయింది. మరోవైపు కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టగా.. తొలిసారి పంజాబ్ అసెంబ్లీ బరిలో నిలిచి ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 20 సీట్లను గెలుచుకుంది.

రంగంలోకి మాయావ‌తి

పంజాబ్ లో 2022 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో .. శిరోమణి అకాలీదళ్ తో తమ పార్టీ పొత్తును బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఆ ఎన్నికల్లో పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నారు. ఆ రాష్ట్రంలో దళితులు, రైతులు, మహిళలు, యువత ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని, వారికి మంచి జీవితాన్ని అందించేందుకు ఈ పొత్తును విజయవంతం చేయాల్సి ఉందని ఆమె చెప్పారు. పంజాబ్ ప్రజలు తమ కూటమికి పూర్తిగా మద్దతునిస్తారని ఆశిస్తున్నామన్నారు. కాగా శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ ..మాయావతికి ఫోన్ చేసి ఆమెకు అభినందనలు తెలిపారు. మిమ్మల్ని త్వరలో ఈ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తానన్నారు. ముఖ్యమైన రెండు పార్టీల మధ్య పొత్తు ఇప్పుడే కుదరడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు.

25 ఏళ్ళ తరువాత శిరోమణి అకాలీదళ్, బహుజన్ సమాజ్ పార్టీ చేతులు కలపడం విశేషం. 1996 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఈ పార్టీలు పొత్తు కుదుర్చుకుని.. రాష్ట్రంలోని 13 లోక్ సభ స్థానాలకు గాను 11 సీట్లల్లో గెలుపొందాయి. ఇప్పుడు రైతుల పోరు ఉధృతంగా సాగుతుండ‌డం, ఆ ప్ర‌భావం పంజాబ్ పై అధికంగా ఉండ‌డంతోనే శిరోమణి అకాలీదళ్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.