iDreamPost
android-app
ios-app

దేశ రాజకీయాల్లో ఒకే ఒక్కడు సుబ్రమణ్య స్వామి

  • Published Sep 15, 2021 | 11:37 AM Updated Updated Sep 15, 2021 | 11:37 AM
దేశ రాజకీయాల్లో ఒకే ఒక్కడు సుబ్రమణ్య స్వామి

ఆయన హిందూవాది.. కానీ అన్ని మతాలను ఆదరిస్తారు. ఆయన ఒక పార్టీకి నాయకుడు..కానీ అన్ని పార్టీల వారితోనూ స్నేహం చేస్తారు. అదే సమయంలో అవసరమైతే తన పార్టీ వారినైనా చీల్చి చెండాడతారు. ఆయన ఆర్థికవేత్త.. అయినా రాజకీయ లోతుపాతులు తెలిసిన విశ్లేషకుడు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో అపారమైన అవగాహనతో ఎన్నో సమాజ వ్యతిరేక కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చి వాటిపై విస్తృత చర్చ జరిగేలా..ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా చేసిన కార్యసాధకుడు. కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లోనూ అనేక ప్రభుత్వాల ఉత్థాన పతనాలను శాసించిన ఆయనంటే రాజకీయ నేతలకు కాస్త భయమే. ఆయనే రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి. 1939 సెప్టెంబర్ 15న చెన్నైలోని మైలాపూర్ లో జన్మించిన ఆయన రాజకీయాల్లో ఒకే ఒక్కడు అని చెప్పడం అతిశయోక్తి కాబోదు.

రాజకీయవేత్తగా మారిన ఆర్థికవేత్త

ఆర్థిక శాస్త్రం అభ్యసించిన స్వామి ఢిల్లీ ఐఐటీలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో క్రియాశీలమయ్యారు. సర్వోదయ ఉద్యమం ద్వారా జనసంఘ్ తరఫున రాజకీయాల్లో చేరిన ఆయన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. 1974లో జనసంఘ్ తరఫున తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తిరిగి 1988లో జనతాపార్టీ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. ప్రస్తుతం బీజేపీకి 2016 నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1977, 1984 ఎన్నికల్లో ఈశాన్య ముంబై నియోజకవర్గం నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా లోకసభకు ఎన్నికయ్యారు. 1998లో మధురై నుంచి అదే పార్టీ తరఫున అన్నాడీఎంకే మద్దతుతో పోటీ చేసి గెలిచారు. 1990 నుంచి 2013 వరకు జనతా పార్టీలో ఉన్న ఆయన ఆ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన 1991లో ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.

ఆయన కుటంబం సర్వమత సమ్మేళనం

సుబ్రహ్మణ్య స్వామి స్వతహాగా హిందూవాది. కానీ ఆయన మైనార్టీల తరఫున కూడా చాలా సందర్భాల్లో నిలబడ్డారు. జనసంఘ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చినా, ప్రస్తుతం బీజేపీలో ఉన్నా సర్వమత సమానత్వం పాటిస్తారు. దానికి ఆయన కుటుంబమే నిదర్శనం. స్వామి సతీమణి రోక్స్ని పార్సీకురాలు. చిన్నల్లుడు ముస్లిం. తమ్ముడి భార్య క్రిష్టియన్. ఇక పెద్ద కుమార్తె గీతాంజలి మన తెలుగింటి కోడలే. విశాఖకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఈ ఏఎస్ శర్మ కుమారుడు సంజయ్ ని ఆమె వివాహం చేసుకున్నారు.

వాజపేయితో విభేదాలు

బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన అటల్ బిహారీ వాజపేయితో సుబ్రహ్మణ్య స్వామికి తొలి నుంచి తీవ్ర విభేదాలు ఉన్నాయి. వాజపేయి పై పలు ఆరోపణలు చేయడంతో పాటు 1999లో వాజపేయి ప్రభుత్వం కూల్చివేతలో కీలకపాత్ర పోషించారు. అప్పటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న జయలలిత, సోనియాగాంధీలను టీ పార్టీతో కలిపారు. అదే ఊపులో మిగతా పార్టీలను ఏకం చేశారు. ఫలితంగా జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో వాజపేయి విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలి వచ్చింది. అందులో ఒక్క ఓటు తేడాతో విశ్వాస తీర్మానం వీగిపోవడంతో వాజపేయి ప్రభుత్వం 13 నెలల్లోనే కూలిపోయింది.

అవినీతికి వ్యతిరేకంగా..

సుబ్రహ్మణ్యస్వామి అవినీతికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. వ్యవస్థలోని లోపాలను వెలికితీయడంలో దిట్ట అయిన ఆయన దాన్నే ఆయుధంగా మలచుకున్నారు.

1988లో కర్ణాటక రాజకీయాలను ఊపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది ఆయనే. అప్పటి కర్ణాటక సీఎం రామకృష్ణ హెగ్డే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలు చివరికి హెగ్డే రాజీనామాకు దారితీశాయి.
1996లో అన్నాడీఎంకే నేత జయలలితపై అక్రమ ఆస్తుల కేసు పెట్టారు. ఆ కేసులో ఆమెకు 2014లో నాలుగేళ్ల జైలు శిక్ష కూడా పడింది. తిరిగి ఆమెతోనే 1998లో చెలిమి చేసి మధురై నుంచి ఆమె మద్దతుతోనే ఎంపీగా ఎన్నికవ్వడమే కాకుండా.. 1999లో వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా ఒప్పించిన రాజకీయ చతురుడు స్వామి.

దేశంలో నల్లధనం పెరిగిపోవడాన్ని నిరసిస్తూ దానికి వ్యతిరేకంగా ఒక సంస్థ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేశారు.

టెలికాం రంగంలో 2జి స్కామును వెలుగులోకి తెచ్చారు. ఆ కుంభకోణమే 2014లో యూపీఏ ప్రభుత్వ ఓటమికి బాటలు వేసింది.

నేషనల్ హెరాల్డ్ స్థలాలు, ఆస్తులను కాజేశారంటూ సోనియా, రాహుల్ గాంధీలపై కూడా కోర్టుకు లాగారు.
1987లో హసింపురాలో జరిగిన ముస్లింల ఊచకోతకు నిరసనగా ఢిల్లీలో వారం రోజులు నిరసన దీక్ష చేశారు.