iDreamPost
android-app
ios-app

Bipin Rawat Biography – జీవితాంతం దేశ రక్షణలోనే బిపిన్ రావత్

  • Published Dec 08, 2021 | 2:36 PM Updated Updated Dec 08, 2021 | 2:36 PM
Bipin Rawat Biography – జీవితాంతం దేశ రక్షణలోనే బిపిన్ రావత్

హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన భారత రక్షణ విభాగాల మహాదళపతి బిపిన్ రావత్ తన జీవితం మొత్తాన్ని దేశ రక్షణకే ధారబోశారు. ఇంకా చెప్పాలంటే అతని కుటుంబం తరతరాలుగా రక్షణ దళాల్లో పనిచేసింది. బిపిన్ కూడా సైన్యంలో అధికారిగా చేరి 40 ఏళ్లు అవిశ్రాంతంగా సేవలు అందించారు. అంచెలంచెలుగా వివిధ ర్యాంకులకు ప్రమోట్ అయ్యి అత్యున్నత పదవి అయిన రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) అయ్యారు. చివరికి ఆ హోదాలోనే అశువులు బాశారు.

సైనిక కుటుంబం

ఉత్తరాఖండ్‌లోని పౌర గర్వాల్ ప్రాంతానికి చెందిన రావత్ పూర్తి పేరు బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. 1958 మార్చి 16న జన్మించారు.ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి ఉత్తరకాశీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె. ప్రాథమిక విద్యాభ్యాసం డెహ్రాడూన్‌లో పూర్తి చేసిన బిపిన్ అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీల్లో చేరారు. అక్కడే స్వార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. అనంతరం డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, వెల్లింగ్టన్, యుఎస్ ఆర్మీ కమాండ్ జనరల్ స్టాఫ్ కాలేజీల్లో హయ్యర్ కమాండ్ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ చేశారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్, మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ స్టడీస్‌లో డిప్లొమాలు చేశారు. సైనిక మీడియా, వ్యూహాత్మక అధ్యయనాలపై చౌదరి చరణ్ సింగ్ వర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ అందుకున్నారు.

Also Read : Army Helicopter, Kannur, Bipin Rawat – కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. అందులో త్రివిధ దళాల అధిపతి బిపిన్‌

తండ్రి పని చేసిన చోట సర్వీస్ ప్రారంభం

తన తండ్రి పనిచేసిన 11 గుర్ఖా రైఫిల్స్ 5వ బెటాలియన్‌లోనే బిపిన్ రావత్ తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1978లో అధికారిగా చేరి పదేళ్లు అక్కడే ఉన్నారు. అనంతరం కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో మేజరుగా పనిచేశారు. కల్నల్ గా తూర్పు సెక్టార్‌లో గూర్ఖా రైఫిల్స్‌కు నాయకత్వం వహించారు. తర్వాత బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. యుఎన్వో తరఫున కాంగోలో బహుళజాతి బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు. మేజర్ జనరల్‌గా ఉరీలో 190 బెటాలియన్‌కు కమాండింగ్ జనరల్ ఆఫీసరుగా.. అనంతరం లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పుణెలోని సదరన్ కమాండ్లో, డెహ్రాడూన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్‌లో జనరల్ స్టాఫ్ ఆఫీసర్ గ్రేడ్-2గా, డిప్యూటీ మిలటరీ సెక్రటరీగా పనిచేశారు. 2016 జనవరి ఒకటో తేదీన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా నియమితులయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్ ఒకటైన ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా.. డిసెంబర్ 31న చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా పదోన్నతులు పొందారు. 2018 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు.

రిటైర్ అయ్యాక తొలి సీడీఎస్ గా

ఆర్మీ, నేవీ, వాయు సేన.. మూడు రక్షణ దళాలను సమన్వయం చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రక్షణ దళాల అధిపతి (సీడీఎస్) పదవిని సృష్టించింది. ఆ పదవిని స్వీకరించిన తొలి అధికారిగా రిటైర్డ్ జనరల్ రావత్ నిలిచారు. మూడేళ్ల కాలానికి 2019 జనవరి ఒకటో తేదీన ఆ పదవి స్వీకరించిన ఆయన పదవీ కాలం వచ్చే నెలలోనే పూర్తి కానుంది. ఇంతలోనే ఈ దారుణం జరిగింది. దేశ రక్షణలోనే ఆయన జీవిత కాలం ముగిసిపోయింది. 40 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో అనేక యుద్ధాల్లో.. డోక్లాం, అరుణాచల్ ప్రదేశ్ వంటి సరిహద్దులో చైనా చొరబాట్లను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. తన సేవలకు గాను పరమ విశిష్ట సేవా పతకం వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

Also Read : Bipin Rawat – సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం