Idream media
Idream media
హైదరాబాద్ లో తాజాగా జరిగిన బయోడైవర్సిటీ వంతెన ప్రమాదంలో కొత్త కోణం వెలుగుచూసింది. వంతెన నిర్మాణానికి తగినంత భూ సమీకరణ చేయకుండా రాజీపడి సేకరించిన స్థలంలోనే వంతెనను నిర్మాణం చేపట్టడం వల్లే మలుపులు ఏర్పడ్డాయని.. ఇప్పుడు ఆ మలుపుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదం తీరుపై నిపుణుల కమిటీ సోమవారం సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ వంతెన లోటుపాట్లపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో ప్రపంచబ్యాంకు రోడ్డు సేఫ్టీ విభాగం సలహాదారు ప్రొఫెసర్ నాగభూషణ రావు, డాక్టర్ టీఎస్ రెడ్డి, ప్రొఫెసర్ శ్రీనివాస్ కుమార్, ప్రదీప్‌రెడ్డి ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు సోమవారం నివేదికను జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌కు సమర్పించారు. అలాగే ఈ నివేదికను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. వంతెనను ఇండియన్ రోడ్డు కూడలికి తగ్గట్టుగా నిర్మించినా వేగంగా వెళ్లే వాహనదారులకు ఇది ఏమాత్రం సురక్షితం కాదని నిపుణుల కమిటీ వెల్లడించింది. ముందుగా నిర్ణయించినట్లు ఈ వంతెనపై వాహనాలు గంటకు 40 కి.మీ. వేగంతో ప్రయాణించడానికి వీలుగా వేగ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుచేయాలని సూచించింది.
నివేదికలోని ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి:
మొత్తంగా వంతెన పొడవు 990 మీటర్లు… ఇంత తక్కువ పొడవున్న వంతెనలో ఎస్ ఆకారంలో రెండు చోట్ల ప్రమాదకరంగా మలుపు తిరిగి ఉంది. ప్రమాణాల ప్రకారమే ఉన్నా అలాంటి ఆకృతి వాహనదారులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదట.. భూసేకరణకు వెనకాడకుండా ఉంటే వంపులు తగ్గి రోడ్డు ఇంకాస్త నిదానంగా ఉండేదని అప్పుడు ప్రమాదశాతం తగ్గేదని నిపుణుల నివేదిక స్పష్టంచేసింది. ముఖ్యంగా వేగ పరిమితిని గంటకు 40 కి.మీ.కు పరిమితం చేయాలని సూచించింది.